టార్గెట్​ యూత్​ .. జిల్లాలో విజృంభిస్తున్న గంజాయి దందా

టార్గెట్​ యూత్​ .. జిల్లాలో విజృంభిస్తున్న గంజాయి దందా
  • మత్తులో చోరీలు.. భవిష్యత్తు బుగ్గిపాలు
  • నిర్మూలించడంలో పోలీస్​, ఎక్సైజ్ శాఖల నిర్లక్ష్యం
  • జిల్లాలో డ్రగ్ అడిక్షన్ సెంటర్​ ఏర్పాటు చేయాలంటున్న జిల్లావాసులు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో గంజాయి రక్కసి విజృంభిస్తున్నది. యూత్​, విద్యార్థులే టార్గెట్​గా గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా గంజాయి వ్యాపారం సాగుతుండడంతో స్టూడెంట్స్​ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. గంజాయిని సేవించిన మైకంలో డబ్బుల కోసం చోరీలు చేస్తూ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.  పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం దక్కడం లేదు. గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతారో చైన్​సిస్టం నెట్​వర్క్​ ద్వారా తెలుసుకుని కొనుగోలు చేస్తున్నారు.  మత్తుకు బానిసలై కండ్ల ముందే పాడవుతుండడంతో తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు.   

పోలీసుల నిఘా కరువు..

గంజాయి వ్యాపారులపై పోలీసుల నిఘా కరువైంది. మోపాల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని రెండు హైస్కూల్స్​కు చెందిన 18 మంది విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు నిర్ధారణ అయ్యింది.  మత్తులోనే తరగతి గదులకు వస్తూ రౌడీల్లా ప్రవర్తిస్తుండడంతో ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు.  గత నెలలో విద్యార్థులు నాలుగు చోరీలకు పాల్పడగా పోలీసులు  అదుపులోకి తీసుకుని, వారి తల్లిదండ్రులకు తెలిపారు. మాక్లూర్ మండలంలో ఆరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు మత్తుకు బానిసై మరో విద్యార్థికి అలవాటు చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థి కోమాలోకి వెళ్లడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో పది రోజులపాటు చికిత్స చేశారు.

 అర్సాపల్లి ఐటీఐకి చెందిన 12 మంది విద్యార్థులు, పాలిటెక్నిక్​ స్టూడెంట్స్ మరో 12 మంది గంజాయికి బానిసలు కాగా,   పలుమార్లు పోలీసులు పట్టుకుని మందలించి వదిలేశారు. బాల్కొండ సెగ్మెంట్​లో ఓ పొలిటికల్ లీడర్ తమ్ముడు  వందలాది మంది యువకులకు గంజాయిని అలవాటు చేసినట్లు తెలుస్తున్నది. ఇది తెలుసుకున్న వారి పేరెంట్స్ ఇటీవల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆర్మూర్, మోర్తాడ్, నవీపేట మండలాల్లో వందలాది మంది యువకులు మత్తుకు బానిసలయ్యారు. గంజాయి రవాణా, సరఫరాలను పోలీస్​, ఎక్సైజ్​ శాఖల అధికారులు నిరోధించకపోవడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం 
చేస్తున్నారు.  

రెండు నెలల్లో రూ.17 కోట్ల విలువ డ్రగ్స్ స్వాధీనం..

గడిచిన రెండు నెలల్లో జిల్లాలో రూ.17 కోట్ల విలువ గల డ్రగ్స్​పట్టుబడింది. జక్రాన్​పల్లి మండలంలోని డ్రగ్స్ డిస్పోజల్​ సెంటర్​లో జనవరి 30న రూ.12 కోట్ల విలువ గంజాయి, అల్ర్ఫాజోలం, డైజోఫాంను జిల్లా ఎక్సైజ్​ ఆఫీసర్లు కాల్చేశారు. ఫిబ్రవరి12న రూ.2.60 కోట్ల విలువ గల డ్రగ్స్​ను దగ్ధం చేశారు.

ఈ నెల 5న అంతే విలువ డ్రగ్స్​ను ధ్వంసం చేశారు.  డ్రగ్స్​ను కాల్చివేసి ఎక్సైజ్ అధికారులు చేతులు దులుపుకున్నారు.. కానీ సరఫరాను నియంత్రించలేకపోయారు. డ్రగ్స్​ ఎక్కడి నుంచి రవాణా అవుతుంది.  ఇందుకు కీలక సూత్రదారులెవరూ అని కనుక్కొలేకపోతున్నారు. అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​​ నేతృత్వంలోని డ్రగ్స్ కంట్రోలింగ్​ కమిటీ సమావేశాలకే పరిమితమవుతుంది కానీ సరైన చర్యలు తీసుకోలేకపోతున్నది. అధిక శాతం విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు కాబట్టి జిల్లాలో డ్రగ్​ అడిక్షన్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.