చాకోస్, స్వీట్ బాక్సుల్లో గంజాయి.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో 7 కిలోలు స్వాధీనం

చాకోస్, స్వీట్ బాక్సుల్లో గంజాయి.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో 7 కిలోలు స్వాధీనం
  • రూ.7 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ మారిజువాన సీజ్​
  • బ్యాంకాక్ నుంచి హైదరాబాద్​కు ట్రాన్స్​పోర్టు
  • ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో రూ.7 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ మారిజువాన (గంజాయి)ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం పట్టుకున్నారు. చిన్న పిల్లలు తినే కెల్లాగ్స్ చాకోస్, స్వీట్ బాక్సుల్లో 7.096 కిలోల మారిజువానను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద దీన్ని గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి ఎన్​డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వివరించారు.

 ప్రత్యేకంగా డిజైన్ చేసిన రూమ్స్​లోనే ఈ తరహా గంజాయిని సాగు చేస్తుంటారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సాధారణ గంజాయి కంటే దీని గాఢత, ధర చాలా ఎక్కువగా ఉంటదని వివరించారు. హైదరాబాద్​లో ఎవరికి సప్లై చేసేందుకు తీసుకొచ్చారనే విషయమై విచారణ చేపడ్తున్నట్లు చెప్పారు. ఇద్దరు ఇండియన్ ప్యాసింజర్లు హైడ్రోపోనిక్ మారిజువాన స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందింది. ఫ్లైట్ నంబర్​తో సహా బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న ప్రయాణికులందరిపై నిఘా పెట్టారు. బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌లో ఫ్లైట్ ఎక్కిన ఇద్దరు ప్రయాణికులను సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

సౌత్ ఆసియాలో మాత్రమే సాగు

వీరి బ్యాగుల్లో అనుమానాస్పదంగా ఉన్న కెల్లాగ్స్ చాకోస్ బాక్స్​ను గుర్తించారు. దాన్ని ఓపెన్ చేయగా.. స్కానర్స్​కు చిక్కకుండా ట్రాన్స్​పరెంట్ ప్లాస్టిక్​తో ప్యాక్ చేసిన 13 ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో ఉన్న గ్రీన్ కలర్ పదార్థాన్ని టెస్ట్ కిట్​తో పరీక్షించారు. అది.. సౌత్ ఆసియాలో పండించే హైడ్రోపోనిక్ మారిజువాన గా తేలింది. బ్యాగేజ్ మొత్తంలో 7.096 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేవలం సౌత్ ఆసియా దేశాల్లో పండించే ఈ హైడ్రోపోనిక్ మారిజువాన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఫారిన్ గంజాయి ముఠాతో పాటు సప్లయర్లు, కస్టమర్లను గుర్తిస్తామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.