
ఒట్టోవా: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. కెనడా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం (మార్చి 9) జరిగిన ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. 59 ఏళ్ల కార్నీ 86 శాతం ఓట్ల సాధించి లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీఎం రేసులో ఉన్న కెనడా మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
లిబరల్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందటంతో తదుపరి కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు కార్నీకి మార్గం సుగమమం అయ్యింది. మొత్తం 1,50,000 మంది పార్టీ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎన్నికలో పాల్గొనగా.. కార్నేకు 1,31,674 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో నిలిచిన క్రిస్టియా ఫ్రీలాండ్కు 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు దక్కాయి.
కాగా, వివిధ కారణాలతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కెనడాలో ఆర్థిక మాంద్యం, అమెరికా నుంచి సుంకాల ఎఫెక్ట్, భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ట్రూడోపై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో 2025, జనవరిలో కెనడా ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్రూడో ప్రకటించారు.
ALSO READ | కుల్ భూషణ్ జాదవ్‌ను పట్టించిన స్కాలర్ హత్య
ట్రూడో రాజీనామాతో అధికార లిబరల్ పార్టీకి ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (మార్చి 9) పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ ఎన్నికలో మార్క్ కార్నీ ఘన విజయం సాధించి ట్రూడో తదుపరి వారసుడిగా ఎన్నికయ్యాడు. పార్టీ నూతన సారథిగా ఎన్నికైన కార్నీ.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో జస్టిన్ ట్రూడో తొమ్మిదేళ్ల పాలనకు తెరపడింది.
ఎవరీ కార్నీ..?
1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నీ.. మాజీ బ్యాంకర్. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన.. గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్ల పాటు పని చేశారు. అనంతరం 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సంవత్సరం పాటు ఆ పదవిలో కొనసాగిన కార్నీ 2004లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2008 ఫిబ్రవరి 1న కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
దాదాపు ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన కార్నీ.. ఈ సమయంలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న కెనడాను గట్టేక్కించి అందరి ప్రశంసలు పొందాడు. 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కెనడా ఆర్థిక మంత్రిగానూ మార్క్ కార్నీ పని చేశారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన కార్నీ.. ఐక్య రాజ్య సమితిలో ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. ట్రూడో ప్రభుత్వంలో కార్నీ పనిచేయనప్పటికీ ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.