మొక్కజొన్న కొనుగోలుకు..మార్క్ ఫెడ్ దూరం

  •    ప్రైవేట్ వైపు రైతుల చూపు
  •     అన్నదాత అవసరాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీచేస్తున్న  వ్యాపారులు
  •     వడ్డీ పేరిట రెండు శాతం కట్
  •     చేసేదేంలేక వారికే అమ్ముతూ నష్టపోతున్న రైతులు

నిర్మల్, వెలుగు : ప్రతి ఏటా మొక్కజొన్న పంటను కొనుగోలు చేసే మార్క్ ఫెడ్ సంస్థ ఈసారి ఆ పంట కొనుగోళ్లకు దూరంగా ఉండడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2090గా ప్రకటించినప్పటికీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్క్​ఫెడ్ పంట కొనుగోళ్లు చేపట్టకపోవడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వ్యాపారుల కు  అమ్ముకుంటున్నారు. అయితే వ్యాపారులు మద్దతు ధర కన్నా రూ.10 ఎక్కువగా చెల్లిస్తున్నప్పటికీ.. నాణ్యత, తూకంలో మోసాలు  చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులను గజిబిజి లెక్కలతో అయోమయానికి గురిచేసి వారిని ముంచుతున్నట్లు తెలుస్తోంది. 

పల్లెల్లోకి దళారులు

రైతుల నుంచి పంటను కొనుగోలు చేసేందుకు మొక్కజొన్న వ్యాపారులు పల్లెల్లోకి దళారులను పంపుతున్నారు. ఈ దళారులు అమాయక రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి సర్కారు ధర కన్నా కొంత ఎక్కువగా చెల్లిస్తామని చెబుతూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. తీరా కొనుగోలు చేసిన తర్వాత నగదు చెల్లించేందుకు షరతులు విధిస్తున్నారు. రెండు శాతం వడ్డీ పేరిట నగదు కట్ చేసుకుని మిగతా సొమ్మును చెల్లిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతుల అంగీకారం మేరకే 2 శాతం కట్ చేసుకొని నగదును చెల్లిస్తున్నామని వ్యాపారులు చెప్తున్నారు. 

ఇప్పటికే 40 శాతం అమ్మకాలు

నిర్మల్ జిల్లాలో ఈసారి లక్షా 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దిగుబడులు సైతం ఆశించిన మేర వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తూ రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. అత్యవసరాల నిమిత్తం  చాలామంది రైతులు వ్యాపారుల వద్దనే పంట అమ్ముకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు.. పంట డబ్బులు వెంటనే చెల్లిస్తే రెండు శాతం వడ్డీ చొప్పున కట్ చేసుకొని మిగతా డబ్బును రైతులకు చెల్లిస్తున్నారు.

పంటను కల్లాల్లో దాచుకునే అవకాశం లేకపోవడంతో రైతులు వ్యాపారులకే మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో చేసేదేంలేక రైతులు  తమ పంటను వ్యాపారులకే అమ్ముకుంటూ నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని 40 శాతం మందికి పైగా రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటను వ్యాపారులకు అమ్ముకున్నారు. రైతులు తమ అవసరాల మేరకే పంట అమ్ముకుంటున్నందున ఈ కోతల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.

నకిలీ విత్తనాలతో నష్టం

మార్క్ ఫెడ్ ఆదుకోకపోవడంతో ఇప్పటికే నష్టపోతున్న రైతులను నకిలీ విత్తనాలు నిండా ముంచాయి.  నకిలీ విత్తనాలు పంట దిగుబడులపై భారీ ప్రభావం చూపాయి. నకిలీ విత్తనాల కారణంగా కేవలం దిలావర్​పూర్ మండలంలోనే దాదాపు 700 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టాల పాలయిందని అక్కడి రైతులు వాపోతున్నారు. ననకిలీ విత్తనాల కారణంగా రెండో దశలో ఉన్న మొక్కజొన్న పంట తీవ్రమైన చీడ పీడల బారిన పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అలాగే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారంతా ఇటీవల మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం సైతం సమర్పించారు. 

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలి

మార్క్​ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలు జరగడం లేదు. దీంతో మేమంతా గత్యంతరం లేక వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. రెండు శాతం వడ్డీ పేరిట కోతలు విధిస్తున్నా తప్పని పరిస్థితుల్లో పంటను వారికే అమ్ముకోవాల్సి వస్తోంది. కనీసం మిగిలిన పంటనైనా మార్క్ ఫెడ్ సంస్థ కొనుగోలు చేయాలి. - 

సాయన్న, మొక్కజొన్న రైతు, దిలావర్​పూర్