- మందుబాబులకు అడ్డాగా మారిన మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మార్కెట్ ఏరియాలు నిరూపయోగంగా మారాయి. నేతాజీ మార్కెట్లలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వృథాగా మారింది. వీధి వ్యాపారుల కోసం ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లను రెండేండ్ల కింద నిర్మించారు. కానీ, నేటికి ఇవి కాళీగా ఉండడంతో.. మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి.
మరోవైపు వ్యాపారులు రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ఎండాకాలం, వానా కాలంలో వ్యాపారులకు ఇబ్బందులు వస్తున్నాయని షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. కానీ, వ్యాపారులను షాపింగ్ కాంప్లెక్స్‌లకు తరలించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో అవసరం లేకున్నా ఆఫీసర్లు మార్కెట్ కాంప్లెక్స్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.
మరో వైపు నేతాజీ మార్కెట్ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారాలు చేసుకునే విధంగా లేవని పలువురు చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. అవి గోదాములగా మాత్రమే ఉపయోగ పడ్తాయని అంటున్నారు. రూ. కోటితో ఎంజీ రోడ్ సమీపంలో అసంపూర్తి నిర్మించిన వాటిని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హడావుడిగా, ఆర్బాటంగా ప్రారంభించారు. కానీ ఇంత వరకు ఆ నిర్మాణం పూర్తి కాలేదు.