వడ్ల గోడౌన్‌‌గా.. బత్తాయి మార్కెట్

నల్గొండ, వెలుగు:  జిల్లా కేంద్రంలో బత్తాయి రైతుల కోసం నిర్మించిన మార్కెట్ వడ్ల గోదాముగా మారింది. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 45వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. ఈ నేపథ్యంలో నల్గొండలో బత్తాయి మార్కెట్​నిర్మిస్తే రైతులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం 2018లో రూ.1.78 కోట్లతో బత్తాయి మార్కెట్ ను నిర్మించింది. అప్పటి మార్కెటింగ్ శాఖమంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా మార్కెట్ ను ఓపెన్ చేశారు. కానీ గత ఐదేళ్లుగా బత్తాయి మార్కెట్​గా పెద్దగా ఉపయోగపడింది లేదు. ఒక విధంగా చెప్పాలంటే బత్తాయిల ట్రేడింగ్​కంటే మిల్లర్లు వడ్లు నిల్వ చేయడంతోపాటు సీజన్​లో ధాన్యం కొనుగోలు కేంద్రంగానే ఎక్కువగా ఉపయోగపడింది. ఫలితంగా మార్కెటింగ్​శాఖకు ఆదాయం కోల్పోతోంది.

ఖర్చులు భరించకనే నేరుగా విక్రయం..

రైతులు పండించిన బత్తాయి సాగంతా డైరెక్ట్​గా ట్రేడర్లు కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్ కు తేవడం తగ్గిపోతోంది. ఈ మార్కెట్​తో పాటు, కోల్డ్​ స్టోరేజీలు నిర్మించాలని రైతులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. దీని కారణంగా బత్తాయి గిట్టుబాటు ధర లభించడమేగాక, మార్కెట్లో డిమాండ్​ఆధారంగా రైతులు ఓపెన్​మార్కెట్లో అమ్ముకునేందుకు దోహద పడేది. కానీ ఇప్పుడున్న మార్కెట్ వల్ల ట్రేడింగ్​కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. రైతులు తోటల నుంచి మార్కెట్​కు బత్తాయి తరలించి, తిరిగి ఇక్కడి నుంచి మళ్లీ ట్రేడింగ్​చేయాలంటే కష్టమవుతోంది. ఈ కారణంగా బత్తాయి రవాణా ఖర్చులు పెరగడమేగాక, ఎగుమతి, దిగుమతి ఖర్చుల భారం రైతులు మోయాల్సి వస్తోంది. దీంతో నల్గొండ మార్కెట్​కు బత్తాయి తరలించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని భావించిన రైతులు నేరుగా తోటల వద్దనే ట్రేడర్లకు హోల్​సేల్​గా అమ్మేస్తున్నారు. తద్వారా రైతులకు ఖర్చులు తప్పడంతోపాటు, అడ్వాన్స్​ల రూపంలో వారికి ముందుగానే డబ్బులు చేతికి అందుతున్నాయి. 

ఐదేళ్లలో రూ.6లక్షలు దాటని ఇన్​కం..

బత్తాయి రైతుల డిమాండ్​మేరకు జిల్లా కేంద్రంలో నిర్మించిన మార్కెట్​వల్ల మార్కెటింగ్​శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఆశించారు. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ.ఐదారు లక్షలు మించి ఆదాయం రాలేదు. ఆడపాదడపా జరిగిన కొనుగోళ్లే తప్పా పెద్ద ఎత్తున ట్రేడింగ్​జరగలేదు. ప్రతి సీజన్​లో 45వేల ఎకరాల్లో బత్తాయి సాగుకాగా 3.83లక్షల మెట్రిక్​టన్నుల దిగుబడి వస్తోంది. నల్గొండ బత్తాయికి ఢిల్లీ, మహారాష్ట్ర, కలకత్తా, చెన్నై మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. క్వింటాలుకు రూ.18వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం నల్గొండ నుంచి బత్తాయి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ పోర్ట్​చేసుకునేందుకు గూడ్స్​రైలును కూడా నడుపుతోంది. కానీ దీని వల్ల ఖర్చుల భారం మీద పడుతుందని రైతులే నేరుగా రవాణా చేసుకోవడం, లేదంటే తోటల వద్దనే ట్రేడర్లతో భేరం కుదుర్చుకుంటున్నారు. 

ALSO READ :డబుల్‌‌ ఇండ్లలోకి పోవుడు ఎప్పుడో.. ఐదు నెలలుగా తప్పని ఎదురుచూపులు

లాభాల బాటలో నిమ్మ మార్కెట్... 

 నల్గొండ బత్తాయి, నకిరేకల్​లో నిమ్మ మార్కెట్​ ఒకేసారి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రూ.3కోట్లతో నిమ్మ మార్కెట్​ నిర్మించారు. ఈ ఐదేళ్లలో 2.46 లక్షల క్వింటాళ్ల నిమ్మకాయలు నకిరేకల్ మార్కెట్ కేంద్రంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. ఈ మార్కెట్​ద్వారా ఆ​శాఖకు రూ.64 లక్షల ఆదాయం వచ్చింది. నిమ్మ మార్కెట్​తో పోల్చితే బత్తాయి మార్కెట్​కు వచ్చిన రూ.ఐదారు లక్షల ఆదాయంలో సగానికి పైగా వడ్ల కొనుగోళ్ల ద్వారా సివిల్​సప్లై డిపార్ట్​మెంట్ నుంచి వచ్చిందే. నకిరేకల్​క్లస్టర్, సూర్యాపేట జిల్లా నుంచే వచ్చే నిమ్మకాయలతోనే మార్కెట్​కు పుష్కలంగా ఆదాయం వస్తోంది. ఒక్క నకిరేకల్ క్లస్టర్​పరిధిలోనే సుమారు12వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. సీజన్​లో 84,623 మెట్రిక్ టన్నుల నిమ్మ దిగుబడి వస్తోంది. ఒక లక్షకు పైగా రైతు లు ఈ మార్కెట్​ద్వారా లాభపడుతున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.