ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్​ రూ.లక్ష కోట్లు అప్

ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్​ రూ.లక్ష కోట్లు అప్

న్యూఢిల్లీ : మనదేశంలోని అత్యంత విలువైన సంస్థలలో టాప్–-10 కంపెనీల్లో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత వారం రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు అత్యధికంగా లాభపడ్డాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు కొత్త సంవత్ 2081 ప్రారంభానికి గుర్తుగా నవంబర్ 1న దీపావళి సందర్భంగా ఒక గంట ప్రత్యేక 'ముహూరత్ ట్రేడింగ్' సెషన్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాయి.  గత వారం సెన్సెక్స్​ 321.83 పాయింట్లు పెరిగింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ) లాభపడగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.  

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్ రూ.36,100.09 కోట్లు పెరిగి రూ.7,32,755.93 కోట్లకు చేరుకుంది.  ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ  రూ.25,775.58 కోట్ల పెంపుతో రూ.9,10,686.85 కోట్లకు చేరింది.  ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ విలువ రూ.16,887.74 కోట్లు పెరిగి రూ.5,88,509.41 కోట్లకు చేరుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15,393.45 కోట్లు పెరిగి రూ.18,12,120.05 కోట్లకు చేరుకుంది.  ఐటీసీ ఎంక్యాప్​ రూ.10,671.63 కోట్లు  పెరిగి రూ.6,13,662.96 కోట్లకు చేరుకుంది.   హిందుస్థాన్ యూనిలీవర్ విలువ రూ.2,537.56 కోట్లు పెరిగి రూ.5,96,408.50 కోట్లకు చేరుకుంది.  

అయితే, ఇన్ఫోసిస్ ఎమ్‌‌‌‌‌‌‌‌క్యాప్ రూ.38,054.43 కోట్లు తగ్గి రూ.7,31,442.18 కోట్లకు చేరుకోగా, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రూ.27,299.54 కోట్లు క్షీణించి రూ.9,20,299.35 కోట్లకు పడిపోయింది.  టీసీఎస్ వాల్యుయేషన్ రూ.26,231.13 కోట్లు తగ్గి రూ.14,41,952.60 కోట్లకు చేరుకుంది.  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ ఎంక్యాప్ రూ.3,662.78 కోట్లు క్షీణించి రూ.13,26,076.65 కోట్లకు చేరుకుంది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది.