
- పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు
- పెద్ద వ్యాపారులకైతే రూ.50, రూ.100లే ఎంట్రీ ఫీజు
- ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి
ఆసిఫాబాద్/కాగజ్నగర్, వెలుగు : పత్తి రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ ధర లేకపోవడంతో పొరుగున ఉన్న మహారాష్ట్రలో రేటు కొంచెం ఎక్కువగా ఉందన్న ఆశతో రైతులు అక్కడి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్మేందుకు వెళ్తుంటే మార్కెట్ కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారు. చెక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎంట్రీ ఫీజు పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. అసలే ధర లేక దగా పడిన పత్తి రైతు.. ఇంటికాడ పంటను నిల్వ చేసుకోలేక మార్కెట్ కమిటీ ఫీజు చెల్లించి మహారాష్ట్రలో పత్తి అమ్ముకుంటున్నారు. అయితే ఈ ఫీజు వసూలులో రైతులకు ఓ లెక్క ఉంటే.. దళారులు, పెద్ద వ్యాపారులకు మరో లెక్క నడుస్తోంది. దీంతో తమను ఫీజు నుంచి మినహాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రైవేట్ వ్యక్తులు, ఆఫీస్ సబార్డినేట్ కూడా లెక్క చూసుడే
వాస్తవానికి రైతులు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం ప్రకటించింది.అయితే రైతులు పండించిన పంటకు నామమాత్రంగా ట్యాక్స్ లు వసూలు చేస్తే ఇబ్బంది లేదు. కానీ కష్టాల్లో ఉన్న రైతులతో సానుభూతితో వ్యవహరించాల్సిన మార్కెట్ కమిటీ తమకు డబ్బులే లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. సిర్పూర్ టీ లో అంతర్రాష్ట్ర రోడ్డు మొదలయ్యే ఫారెస్ట్ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ లో ప్రైవేటు వ్యక్తులు ఉండడం విస్మయం కలిగిస్తోంది. కాగజ్ నగర్ మార్కెట్ కమిటీకి చెందిన జూనియర్ మార్కెట్ సూపర్ వైజర్ ఈ సెంటర్ కి ఇన్ చార్జిగా ఉన్నాడు .ఆయనతో పాటు ఓ కింది స్థాయి ఉద్యోగి, మరో ముగ్గురు వ్యక్తులు రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. ఎంట్రీ ఉన్న బండ్లు ఇచ్చే వందతో ప్రైవేట్ వర్కర్ల కు జీతాలు ఇస్తున్నట్లు చెబుతుండగా, మార్కెట్ కమిటీ నుంచి ఒక్కొక్కరికి నెలకు రూ.8 నుంచి రూ.12 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మితే చాలా మంది నెట్ క్యాష్ ఇవ్వకుండా మూడు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు సమయం పెడుతున్నారు. అదే మహారాష్ట్ర లో అయితే పంట అమ్మిన వెంటనే డబ్బులు ఇస్తుడడంతో మన రైతులు మహారాష్ట్రకు వెళ్తున్నారు. మార్కెట్ కమిటీ వసూళ్ల నుంచి తప్పించుకునేందుకు రైతులు.. వెంకట్ రావుపేట దగ్గర ఉన్న వార్ధా నది మీద ఉన్న బ్రిడ్జి మీదుగా లేదా చేన్ల మీదుగా వెళ్తూ సెస్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంట్రీ ఉంటే రైట్ రైట్.. రైతుల బండ్లకి వేలల్లో వసూలు
సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఏకైక మార్కెట్ కమిటీ కాగజ్ నగర్ లో ఉంది. అయితే గత కొన్నేళ్లుగా మార్కెట్ కమిటీ తీరు వివాదాస్పదంగా ఉంది. ఇక్కడి జిన్నింగ్ మిల్లులకు మేలు చేయాలనో, లేదంటే మహారాష్ట్రలో రైతులు పంట అమ్ముకొని లాభపడడం ఇష్టం లేకనో ప్రత్యేక కౌంటర్లు పెట్టి మరీ సెస్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఒక శాతం పన్నును వ్యాపారి, మార్కెట్ కమిటీకి రైతు కడుతున్నాడు. దీనికి తోడు ఇప్పుడు రైతుల నుంచి సెస్ పేరుతో మార్కెట్ కమిటీ చెక్ పాయింట్ వద్ద ఎంట్రీ ఫీజు వసూలు చేస్తోంది. బొలెరో వాహనానికి రూ.1,000 నుంచి రూ.1,500 , వ్యాన్ కు రూ.2,500 నుంచి రూ.3,500 వసూలు చేస్తున్నారు. కానీ ఎంట్రీ ఫీజు రూ.50 నుంచి రూ.100 మాత్రమే వసూలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. మరోవైపు పెద్ద వ్యాపారుల నుంచి రూ.50, రూ.100 మాత్రమే వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతుండగా పెద్ద వ్యాపారులకు మేలు జరుగుతోంది.