న్యూఢిల్లీ: ఈ వారం యూఎస్, ఇండియా ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు విడుదల కానున్నాయి. వీటితో పాటు గ్లోబల్ ట్రెండ్స్, కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) రిజల్ట్స్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) ట్రెండ్ మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్‌కు శుక్రవారం సెలవు. ‘ఇండియా రిటైల్ ఇన్‌ఫ్లేషన్ డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా నవంబర్ 12 న వెలువడనున్నాయి. హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ డేటా నవంబర్ 14 న విడుదల కానుంది.
గ్లోబల్‌గా చూస్తే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు నవంబర్ 13 న రిలీజ్ కానున్నాయి’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. చాలావరకు పెద్ద కంపెనీల రిజల్ట్స్ వెలువడడంతో మార్కెట్ ఫోకస్ ఎకనామిక్ డేటా వైపు షిప్ట్ అవుతుందని అంచనా వేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, అపోలో టైర్స్ ఈ వారం తమ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. ‘యూఎస్ బాండ్ ఈల్డ్‌లు, డాలర్ ఇండెక్స్ కదలికలు ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఈ రెండు కూడా యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వెలువడ్డాక భారీగా పెరిగాయి’ అని మీనా వివరించారు.