న్యూఢిల్లీ: మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి రావడం, పెద్ద కంపెనీల షేర్లు ర్యాలీ చేయడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు రికార్డ్ లెవెల్స్‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ శుక్రవారం సెషన్‌లో 62,447 వద్ద ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. నిఫ్టీ 18,534 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త గరిష్టమైన 43,339 కి చేరుకుంది. కీలక ఇండెక్స్‌లు గరిష్ట లెవెల్స్‌లో ట్రేడవుతున్నప్పటికీ మెజార్టీ రిటైల్ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియో ఇంకా నష్టాల్లోనే ఉందని చెప్పొచ్చు. సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, లార్జ్ క్యాప్ షేర్లు ర్యాలీ చేయడంతోనే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు తాజాగా కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. అందుకే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వలన వచ్చిన నష్టాల నుంచి మెజార్టీ చిన్న ఇన్వెస్టర్లు ఇంకా బయటపడలేదు. గత కొన్నేళ్లుగా అండర్‌పెర్ఫార్మ్ (పెద్దగా పెరగని) చేసిన లార్జ్ క్యాప్ షేర్లు తాజాగా పెరుగుతున్నాయని, వీటిని రిటైల్ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడమో లేదా మార్కెట్ పడినప్పుడు వదులుకోవడమో చేశారని ఎనలిస్టులన్నారు.
హిస్టరీ చూసి ఇన్వెస్ట్‌మెంట్..
తాజా మార్కెట్ ర్యాలీ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు ఎక్కువగా లాభపడలేదో బొనాంజా ఫోర్టుఫోలియో రీసెర్చ్ హెడ్ విశాల్ వాఘ్ వివరించారు. ‘మార్కెట్‌లో ఇది సహజమే. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పెద్దగా పెరగకపోతే, రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా లాభపడరు. కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. కానీ, గత కొన్నేళ్లలో ఇవి అండర్‌పెర్ఫార్మ్ చేయడం వలన ఈ షేర్లను చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు. ఉదా. పీఎస్‌యూ షేర్లు తాజా ర్యాలీలో మెరిశాయి. కానీ, వీటి గత కొన్నేళ్ల పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉంది’ అని విశాల్ అన్నారు. ఫండ్స్ కేటాయింపు అనేది సెక్టార్ల హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందని పేర్కొన్నారు. చివరి బుల్ రన్‌లో ఐటీ షేర్లు బాగా పెర్ఫార్మెన్స్ చేశాయి. అందుకే తాజాగా కరెక్షన్ వచ్చినా తక్కువ రేటుకు దొరికే ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. మరోవైపు పీఎస్‌యూల హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు. దీంతో తమ పోర్టుఫోలియోల నుంచి వీటిని వదిలించుకోవడమో లేదా తక్కువ ఫండ్స్‌ను కేటాయించడమో చేశారు. తాజా మార్కెట్ ర్యాలీలో పీఎస్‌యూలే ఎక్కువగా పెరిగాయి. కొన్ని గత రెండు నెలల్లోనే 50 శాతం వరకు లాభపడ్డాయి.
ఆకర్షణీయంగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100
వచ్చే ఏడాది ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ముందు మార్కెట్ ర్యాలీ కొనసాగొచ్చని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అన్నారు. ‘మార్కెట్ అవుట్‌లుక్ బుల్లిష్‌గా ఉంది. పెద్ద కరెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందువలన రానున్న సెషన్లలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ర్యాలీ చేయొచ్చు. సాధారణంగా, డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లోస్ తక్కువగా ఉంటాయి. ఈ నెలలో ఇండెక్స్‌లు కంటే నిర్ధిష్టమైన షేర్లు ఎక్కువగా లాభపడతాయి’ అని పేర్కొన్నారు. గ్లోబల్ సమస్యలు తగ్గు ముఖం పట్టడంతో బ్యాంకింగ్, కొన్ని ఫ్రంట్‌లైన్ షేర్లు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను నడిపాయని ఏంజెల్ వన్ ఎనలిస్ట్ రాజేష్ బోస్లే అన్నారు. నిఫ్టీ 50 కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పారు.