4 రోజుల్లో 6 శాతం పెరిగిన మార్కెట్.. ఇన్వెస్టర్ల రూ.26 లక్షల కోట్ల లాభం

4 రోజుల్లో 6 శాతం పెరిగిన మార్కెట్.. ఇన్వెస్టర్ల రూ.26 లక్షల కోట్ల లాభం

న్యూఢిల్లీ: అమెరికా సుంకాలకు తాత్కాలిక విరామం రావడం,  విదేశీ పెట్టుబడిదారులు పెరగడం, ఈసారి వర్షాలు బాగుంటాయనే అంచనాలు మార్కెట్లకు బూస్ట్​లాగా పనిచేస్తున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్,  నిఫ్టీ 6 శాతానికి పైగా పెరిగాయి.  రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆర్​బీఐ మూడో రేటు కోతపై ఆశలను పెంచింది. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్​ 4,706.05 పాయింట్లు (6.37 శాతం), ఎన్​ఎస్ఈ నిఫ్టీ 1,452.5 పాయింట్లు (6.48 శాతం) పెరిగింది. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.25.77 లక్షల కోట్లు పెరిగి రూ.4,19,60,046.14 కోట్లకు చేరుకుంది. శుక్రవారం 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. 

వరదలా విదేశీ నిధులు

విదేశీ నిధుల ప్రవాహం, అమెరికా సుంకాలపై తాత్కాలిక విరామం,  వడ్డీరేట్ల తగ్గింపుల వల్ల భారీ ర్యాలీ వచ్చిందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ రీసెర్చ్ అండ్​ అడ్వైజరీ ఎగ్జిక్యూటివ్​ విష్ణుకాంత్ ఉపాధ్యాయ్ అన్నారు.  గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్​ఐఐలు బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారని చెప్పారు.  ఆర్​బీఐ రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు.  ఆర్​బీఐ తన విధాన వైఖరిని "తటస్థం" నుంచి "అకామడేటివ్​"కి మార్చుకుంది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని రేటు కోతలు సాధ్యమనే సంకేతాలను పంపింది.  

రెలిగేర్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రీసెర్చ్ ఎనలిస్టు అజిత్ మిశ్రా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్​వంటి వాటిని సుంకాల నుంచి మినహాయించడం, కొన్నింటిని వాయిదా వేయడంతో మార్కెట్లలో ఉత్సాహం కనిపిస్తోందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి తగ్గించగల చర్చలపై ఆశలు పెరిగాయని  అన్నారు. వాతావరణశాఖ అంచనాలు, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడంతో వడ్డీ రేటు మరింత తగ్గవచ్చనే అంచనాలు పెరిగాయని విశ్లేషించారు. వచ్చే వారంలో అందరి దృష్టి కంపెనీల నాలుగో క్వార్టర్​రిజల్ట్స్​పై ఉంటుందని మిశ్రా అన్నారు. కూరగాయల వంటి ధరలు తగ్గడం వల్ల మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిందని చెప్పారు.