- 964 పాయింట్లు డౌన్
- నిఫ్టీ 247 పాయింట్లు పతనం
- రూపాయి..ఆల్‌టైమ్ లో!
- 19 పైసల నష్టం
ముంబై: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం, వచ్చే ఏడాదిలో ఆశించినస్థాయిలో కోతలు ఉండబోవంటూ సంకేతాలు ఇవ్వడంతో ఇండియా మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. దీనికితోడు గ్లోబల్ ఈక్విటీల్లో భారీ అమ్మకాల కారణంగా సెన్సెక్స్ గురువారం 965 పాయింట్లు పడిపోయి 80 వేల స్థాయికి దిగువకు చేరింది. విదేశీ నిధులు భారీగా తరలిపోవడానికి తోడు కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
ఫలితంగా ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు వరుసగా నాలుగో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 964.15 పాయింట్లు తగ్గి 79,218.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1,162.12 పాయింట్లు పతనమై 79,020.08 వద్దకు చేరుకుంది. బీఎస్ఈలో 2,315 స్టాక్‌లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 247.15 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువకు పడిపోయింది. గత నాలుగు రోజుల్లో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 2,915.07 పాయింట్లు లేదా 3.54 శాతం పడింది.
నిఫ్టీ 816.6 పాయింట్లు లేదా 3.29 శాతం క్షీణించింది. యూఎస్ఫెడ్వడ్డీరేట్లను పెంచిందని, అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన వడ్డీ రేట్లను మార్చకపోవడం ఆశ్చర్యపరిచిందని ఎనలిస్టులు అన్నారు. ఇది అమ్మకాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడిందని, ఎఫ్‌ఐఐల అమ్మకాల వల్ల నష్టాలు పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గత నాలుగు రోజుల మార్కెట్ అమ్మకాలతో ఇన్వెస్టర్ల సంపద రూ. 9.65 లక్షల కోట్లు క్షీణించింది. బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,65,935.96 కోట్లు తగ్గి రూ.4,49,76,402.63 కోట్లకు ( 5.29 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది
సెన్సెక్స్‌లో మూడే కంపెనీలకు లాభాలు
సెన్సెక్స్ ప్యాక్‌లో సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్ మినహా మిగతా 27 కంపెనీలు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా బాగా నష్టపోయాయి. పెరుగుతున్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు రూపాయితో సహా పలు కరెన్సీలను విపరీతంగా పడేశాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే అన్నారు.
గురువారం యూఎస్ డాలర్‌తో రూపాయి 19 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 85.13 (తాత్కాలిక) వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.30 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లలో, బీఎస్‌ఈ ఫోకస్డ్ ఐటీ 1.20 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.15 శాతం, ఐటీ 1.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.07 శాతం, టెక్ 1.05 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.05 శాతం పడిపోయాయి.
బీఎస్‌ఈ హెల్త్‌కేర్ మాత్రమే లాభపడింది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాల పాలయ్యాయి. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ బుధవారం భారీగా నష్టపోయింది. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ.1,316.81 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.08 శాతం తగ్గి 73.33 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే, తాజా క్వార్టర్లో యూఎస్జీడీపీ గ్రోత్ 3.1 శాతంగా నమోదయింది. ఈసారి ఇది 2.8 శాతం పెరుగుతుందన్న అంచనాలను మించింది