ముంబై: సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఆరవ సెషన్లోనూ నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పెద్దగా సానుకూల సంకేతాలు లేకపోవడం, ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 638.45 పాయింట్లు పతనమై 81,050 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 962.39 పాయింట్లు క్షీణించి 80,726.06 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 218.85 పాయింట్లు పడి 24,795.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఏపీసెజ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్బ్యాక్, యాక్సిస్ బ్యాంక్, హెడీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.
బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8.90 లక్షల కోట్లు తగ్గి రూ. 4,51,99,444.70 కోట్లకు చేరింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 1.85 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.27 శాతం క్షీణించింది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ క్వాలిటీపై ఫిర్యాదులు రావడంతో దీని షేర్లు 8 శాతం పైగా పడిపోయి రూ.90.82కి చేరుకున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఓలాకు నోటీసులు జారీ చేసింది. అయితే, జర్మనీకి చెందిన హైడెల్‌బర్గ్ మెటీరియల్స్‌కు చెందిన భారతీయ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందన్న వార్తల కారణంగా హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా స్టాక్ 4 శాతం లాభంతో ముగిసింది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2.09 శాతం పెరిగి 79.68 డాలర్లకు చేరుకుంది.యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ లాభడ్డాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. ఎఫ్ఐఐలు రూ.9,896 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.