
- రెండు రోజులుగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారుల మకాం
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా మిర్చి కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై ఎంక్వైరీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారుల కమిటీ రెండ్రోజులుగా ఖమ్మం మార్కెట్లో రైతులతో మాట్లాడి మిర్చి కొనుగోళ్లకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఖరీదుదారులు, ట్రేడర్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం మార్కెట్లో ఆర్డీ(రేట్ డిఫరెన్షియేట్) పేరుతో జరుగుతున్న దందాపై ప్రధానంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల కమిటీలో మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి కీలకంగా ఉన్నారు. ఈమె మార్కెటింగ్ శాఖలో రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్గా కూడా పని చేస్తున్నారు. ఆమెతో పాటు పెద్దపల్లి, వరంగల్ డీఎంవోలు ప్రవీణ్ రెడ్డి, సురేఖ ఖమ్మంలో మకాం వేశారు. మరో రెండు రోజులు ఈ కమిటీ ఖమ్మంలోనే ఉంటుందని సమాచారం. ఖమ్మం మార్కెట్లో ఆర్డీ దందా ఎలా జరుగుతుంది? దానిని ఎలా కట్టడి చేయాలనే అంశాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకే ఈ ఎంక్వైరీ జరుగుతున్నట్లు సమాచారం. అయితే జిల్లా మార్కెటింగ్ అధికారులు మాత్రం ఖమ్మంలో మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆఫీసర్లు వచ్చారని చెబుతున్నారు.
గత వారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లోనూ ఈ అధికారులు పర్యటించి కొనుగోళ్లపై ఎంక్వైరీ చేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి టీఆర్(టెంపరరీ రిజిస్ట్రేషన్) విషయంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖమ్మంలో ఎక్కువ రేటుకు కొన్న ఎర్ర మిర్చిని, తాలు మిర్చిగా రికార్డులో చూపిస్తూ, తక్కువ రేటుకు కొన్నట్లుగా తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నారు. దీంతో మార్కెట్ సెస్ తో పాటు ఆదాయపు పన్నును ఎగవేస్తున్నారు. ఇలా ప్రతి సీజన్లో రూ.కోట్లలో ఈ దందా జరుగుతుండగా, రూ. లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.