
- 1,577 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 500 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- ఇన్వెస్టర్లకు రూ.8.7 లక్షల కోట్లు లాభం
ముంబై: టారిఫ్ టెన్షన్లు తగ్గడంతో మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం రెండు శాతానికి పైగా పెరిగాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కొన్ని సుంకాలను సడలిస్తామని, ఆటోమొబైల్స్‌కు సుంకాలను మార్చుతామని సంకేతాలు పంపడంతో గ్లోబల్ మార్కెట్లలోనూ ర్యాలీ వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు పెరిగి 76,734.89 వద్ద సెటిలయింది.
ఇంట్రాడేలో 1,750.37 పాయింట్లు పెరిగి 76,907.63 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 500 పాయింట్లు పెరిగి 23,328.55 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 539.8 పాయింట్లు ర్యాలీ చేసి 23,368.35 వద్ద ఆగింది. ఈ నెల రెండో తేదీన ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల వల్ల వచ్చిన నష్టాలను కీలక సూచీలు భర్తీ చేసుకున్నాయి. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఈ రియాల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రియల్స్ 5 శాతం వరకు పెరిగాయి.
సెన్సెక్స్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ 6.84 శాతం పెరిగింది. టాటా మోటార్స్ 4.50 శాతం ర్యాలీ చేసింది. లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ మాత్రమే నష్టపోయాయి. గత రెండు రోజుల్లో పెట్టుబడిదారుల సంపద రూ.18.42 లక్షల కోట్లు పెరిగింది. మంగళవారం ఒక్క రోజే ఇది రూ.8.7 లక్షల కోట్లు ఎగిసింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లకు జోష్...
బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. రియాల్టీ 5.81 శాతం, పారిశ్రామిక రంగం 3.76 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ 3.67 శాతం, ఆటో 3.39 శాతం, వినియోగదారుల విచక్షణ 3.12 శాతం, ఆర్థిక సేవలు 2.94 శాతం, మెటల్ 2.75 శాతం పెరిగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ గేజ్ 3.21 శాతం పెరిగింది మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.02 శాతం ర్యాలీ చేసింది. మంగళవారం మొత్తం 3,302 స్టాక్‌లు లాభపడగా, 785 స్టాక్‌లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్, టోక్యోలోని నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.52 శాతం తగ్గి బ్యారెల్‌కు 64.54 డాలర్లకు చేరుకుంది.
భారీగా పెరిగిన ఆటోస్టాక్స్
టారిఫ్‌ల నుంచి ఆటో పరిశ్రమను తాత్కాలికంగా మినహాయిస్తామని, ఎలక్ట్రానిక్స్‌పై రద్దు చేస్తామన్న ట్రంప్ ప్రకటన ర్యాలీకి దారితీసిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. టారిఫ్ ఉపశమనం వల్ల ఆటో స్టాక్‌లు లాభపడ్డాయని, డిపాజిట్ రేటు కోతల వల్ల బ్యాంకింగ్ స్టాక్‌లు పెరిగాయని ఆయన వివరించారు. బీఎస్ఈలో సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ షేర్లు 8.17 శాతం, భారత్ ఫోర్జ్ 6.86 శాతం, టాటా మోటార్స్ 4.50 శాతం, ఎంఆర్‌ఎఫ్ 4.50 శాతం పెరిగాయి.
హీరో మోటోకార్ప్ షేరు 4.02 శాతం, ఐషర్ మోటార్స్ 3.45 శాతం, టీవీఎస్ మోటార్ 3.06 శాతం, అశోక్ లేలాండ్ 3.04 శాతం, బజాజ్ ఆటో 2.79 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.42 శాతం, మారుతి 2.15 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 3.39 శాతం పెరిగి 47,618.30కి చేరుకుంది.