
- జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 300 ప్రైవేట్ నిర్మాణాలు
- ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు 200 ప్రైవేట్ స్థలాల సేకరణకు నిర్ణయం
- నష్టపరిహారం కంటే టీడీఆర్ వర్తింపుకే అధికారులు మొగ్గు!
- నిధుల సేకరణపై హెచ్ఎండీఏ కసరత్తు
హైదరాబాద్, వెలుగు : ఎలివేటెడ్ కారిడార్ పనులు ఊపందుకున్నాయి. భూసేకరణపై హెచ్ఎండీఏ అధికారులు ఫోకస్‌పెట్టారు. పలు ప్రాంతాల్లో సేకరించాల్సిన ప్రైవేట్ ఆస్తులను మార్కింగ్చేస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండీఏ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ, డిఫెన్స్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. భూసేకరణపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు ఒక రూపం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగా ముందుగా ప్రైవేట్ భూముల సేకరణపై దృష్టి పెట్టారు. అయితే భూములు కోల్పోయే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారంపై తర్జనభర్జన పడుతున్నారు. అవసరమైన నిధులు ఎలా సేకరించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. నష్టపరిహారం కంటే భూములు కోల్పోయే వారికి ట్రాన్సఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) వర్తింపచేయాలని యోచిస్తున్నారు. టీడీఆర్ అంటే భూములు కోల్పోయే వారు మిగిలిన స్థలంలో అవసరమైన మేర ఒకటి లేదా రెండు ఫ్లోర్లు నిర్మించుకునేందుకు అనుమతి ఉంటుంది.
అందుకు జీహెచ్ఎంసీకి గానీ, హెచ్ఎండీఏకు గానీ ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంతో హెచ్ఎండీఏపై నష్టపరిహారం భారం పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కంటోన్మెంట్పరిధిలో టీడీఆర్ వర్తించదు. కాబట్టి ఇక్కడి భూ నిర్వాసితులకు తప్పని సరిగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ ముగిశాక నష్టపరిహారం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెడీ అవుతున్నారు.
మారనున్న రూపు రేఖలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. వాహనాలు వేగంగా మూవ్అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్ వరకు 5.32కి.మీ. మేరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం రూ.1,580 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 74 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో డిఫెన్స్ ల్యాండ్ 56 ఎకరాల వరకు, ప్రైవేట్ భూములు 9 ఎకరాల వరకు ఉన్నాయి.
ఇక జేబీఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్‌పేట ఓఆర్ఆర్ను కలిపే ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.2,232 కోట్లతో నిర్మిస్తున్నారు. 11.12 కి.మీ. మేరకు నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్‌కు చెందిన భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్‌భూములను సేకరించాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 300 ప్రైవేట్ నిర్మాణాలను గుర్తించారు. డబుల్ డెక్కర్ కారిడార్ కోసం 200పైగా నిర్మాణాలను గుర్తించారు. మిలిటరీ ఎస్టేట్ భూములు, కంటోన్మెంట్‌బోర్డుకు చెందిన భూములను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.