నెల రోజుల్లో ప్యాకేజీ అందిస్తామని హామీ
అచ్చంపేట, వెలుగు: మండలంలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్లపాడు తండాను ఆదివారం అర్ధరాత్రి వరద ముంచెత్తింది. మర్లపాడు తండాలోని ప్రజలకు పూర్తి స్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించకపోవడంతో గ్రామస్తులు అక్కడే ఉంటున్నారు. భారీ వర్షాలతో డిండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ రావడంతో గ్రామం పూర్తిగా నీట మునిగింది.
విషయం తెలుసుకున్న కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ జేసీబీపై గ్రామానికి వెళ్లి నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారిపల్లి నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సౌలతులతో ఇండ్లను నిర్మించి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ముంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు.
అంతకుముందు నక్కల గండి ప్రాజెక్టు నీటిలో నాటు పడవలో ప్రయాణించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మన్నె వారిపల్లి గ్రామ సమీపంలో దుందుభి నదిని పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో మాధవి, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ మురళీమోహన్ పాల్గొన్నారు.