Marnus Labuschagne: 2023 వరల్డ్ కప్ ఫైనల్.. బ్యాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే తన బ్యాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. సాధారణంగా క్రికెటర్లు ఫార్మాట్ కు లేదా బౌలింగ్ కు రిటైర్మెంట్ ఇవ్వడం చూసి ఉంటాం. కానీ లాబుస్‌చాగ్నే మాత్రం తన బ్యాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ బ్యాట్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు మార్నస్ వీడ్కోలు పలికిన ఈ బ్యాట్ తో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. 

భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో  లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 241 ఛేజింగ్‌లో ఒకదశలో ఆస్ట్రేలియా పవర్‌ప్లేలోనే  47 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన ఈ ఆసీస్ బ్యాటర్ 110 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేసి భారత్ కు వరల్డ్ కప్ ను దూరం చేశాడు. 

జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ,రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లతో కూడిన దుర్బేధ్యమైన బౌలింగ్ దళాన్ని మార్నస్ సమర్ధవంతంగా అడ్డుకొని హెడ్ తో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 2023 వన్డే వరల్డ్ కప్ విజయం ముగిసి తొమ్మిది నెలలు కావొస్తుంది. దీంతో తాజాగా లాబుస్‌చాగ్నే ఫైనల్‌లో తనకు అజేయంగా అర్ధసెంచరీని అందించిన బ్యాట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 30 ఏళ్ల ఈ బ్యాటర్.. తన బ్యాట్ చాలా దెబ్బతిన్నదని చెప్పకొచ్చాడు. ఈ బ్యాట్ త్వరలో   వేలంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.