- ఉన్నతమైన పదవులు చేపట్టి..ఉత్తమ సేవలందించారు:గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,
- ఇందిరాపార్క్ రాక్ గార్డెన్ లో చెన్నారెడ్డి 28వ వర్ధంతి
ముషీరాబాద్, వెలుగు: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉన్నతమైన పదవులు చేపట్టి.. అత్యున్నతమైన సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు. చిన్నప్పటినుంచి చదువులో రాణించి.. డాక్టర్‌గా పేద ప్రజలకు సేవలు అందించారన్నారు.
సోమవారం ఇందిరాపార్క్ రాక్ గార్డెన్లో మర్రి చెన్నారెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, మాజీ మంత్రులు సమర సింహా రెడ్డి, సి.కృష్ణాయాదవ్, పొన్నాల లక్ష్మయ్య, విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రర్ రావు హాజరై ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. సీఎం, కేంద్ర మంత్రి, గవర్నర గాచెన్నారెడ్డి అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు.1990లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. ప్రజలకు ఎన్నో సేవలను అందించారని తెలిపారు. క్రీడారంగంలో కూడా తనదైన శైలిని ప్రదర్శించారన్నారు.
చెన్నారెడ్డి వ్యక్తి కాదని.. ఆయన మహా సంస్థ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. యవ్వనంలోనే రాష్ట్ర కాన్సిట్యుషన్ సభ్యుడిగా ఉన్నారని.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహా వ్యక్తి అని కొనియాడారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా.. ఏమాత్రం భయపడలేదని గుర్తుచేశారు.