- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలు
- తొమ్మిదేండ్లు ఏం చేసినవని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కేడర్‌పై ఫైర్
నాగర్ కర్నూల్, వెలుగు : కాంగ్రెస్ నేతలపై నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సంగతి తెల్వదని, తాను తలుచుకుంటే కాంగ్రెసోడ్ని ఒక్కొక్కడిని కాల్చి పండబెడ్త అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం బొప్పల్లిలో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌లో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ‘జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు. ‘‘తొమ్మిదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి మా ఊరికి ఏం చేసినవ్.. ఒక్క వర్క్ చేయలేదు.. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు..
ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఎందుకు వచ్చినవ్’’ అని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ‘‘మీ నాగం జనార్దన్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిన్రు?’’ అని ప్రశ్నించారు. ‘‘నాగం జనార్దన్‌రెడ్డి 400 ఎకరాల భూమి పంపిణీ చేయించిండు.. బొప్పల్లిలో హాస్పిటల్ కట్టించిండు.. అప్పుడు వేసిన సీసీ రోడ్లే తప్ప కొత్తగా నీవు చేసిందేం లేదు’’ అని కాంగ్రెస్ కార్యకర్తలు అన్నారు. దీంతో సహనం కోల్పోయిన మర్రి జనార్దన్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. ‘‘వాడు నన్ను పీకాలంటే 10 ఏండ్లు పడ్తది. అన్ని కట్టెల్లో కాలి వచ్చిన, నేను పీకి పడేస్తే చెయ్యి ఇట్ల ఎల్లిపోతది. నాతో పెట్టుకుంటే మీకే మైనస్ రా బై.
నా క్యాడర్‌కు చెప్తే ఒక్క నా కొడుకు ఇక్కడ తిరుగడు” అని హెచ్చరించారు. ‘‘దమ్ము, ధైర్యం ఉంటే రేపటి నుంచి కాంగ్రెసోడ్ని తిరగమను.. ఒక్కొక్కడ్ని కాల్చి పండబెడ్త. నా సంగతి మీకు తెల్వదు. అనవసరంగా నన్ను గెలుకుతున్నరు’’ అని ఫైర్ అయ్యారు. తన క్యాడర్ ముందు, ప్రజల ముందు ఎవడూ నిలబడలేడని అన్నారు. మర్రి కామెంట్స్‌పై కాంగ్రెస్ లీడర్ భగవంతరావ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో నాగం శశిధర్ రెడ్డి తదితరులు అడిషనల్ ఎస్పీకి కాంప్లైంట్ ఇచ్చారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్కార్యకర్తలు మర్రి జనార్దన్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఓటమి భయంతోనే కామెంట్లు: మల్లు రవి
మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్మల్లు రవి స్పందించారు. ‘‘ఓటమి భయంతోనే నోరు పారేసుకున్నడు. అహంకారపూరిత వైఖరి మార్చుకోవాలి. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులే అడ్డగోలుగా మాట్లాడితే సామాన్య కార్యకర్తలు ఎటువంటి భాష వాడాలి” అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు స్థానం లేదని చెప్పారు. ‘‘మొనగాళ్లం అనుకున్నోళ్లెందరో అడ్రస్ లేకుండాపోయారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు సహనంతో ఉండాలి” అని అన్నారు.