మర్రి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

మర్రి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి  చెందిన MLRIT , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో స్వల్ప  ఊరట లభించింది.   చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ లో నిర్మాణాలపై ఏడు రోజుల వరకు స్టే విధించింది. సంబంధిత డాక్యుమెంట్లతో ఏడు రోజుల్లోగా తహసీల్దార్‌ ను కలసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. వివరణ తర్వాత చట్టప్రకారం ముందుకు వెళ్లాలని తహసీల్దార్‌ ను ఆదేశించింది.  ఈ ఏడు రోజుల వరకు తహసీల్దార్‌ కూల్చివేత సహా  ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పింది.

ALSO READ | కూల్చకుండా స్టే ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన MLRIT సంస్థల అధినేత

 భూమిని సర్వే చేయకుండా గండిమైసమ్మ తహసీల్దార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వాదనలు వినిపించారు మర్రి రాజశేఖర్ రెడ్డి తరపు  న్యాయవాదులు. అయితే  విద్యార్థుల అకాడమిక్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల భవనాలు, నిర్మాణాలను కూల్చివేయడం లేదని, సెలవుల్లో మాత్రమే చర్యలు తీసుకుంటామని హైడ్రా చేసిన ప్రకటననూ న్యాయస్థానం దృష్టికి  తెచ్చారు న్యాయవాదులు.

మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు

హైదరాబాద్ సిటీ శివార్లలోని దుండిగల్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 2024, ఆగస్ట్ 28వ తేదీ ఈ మేరకు సమాచారం ఇచ్చారు అధికారులు. దుండిగల్ పరిధిలో ఉన్న చిన్నదామెర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం జరిగిందని.. దీనికి సంబంధించి మీ వివరణ ఏంటీ అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు. 

చిన్నదామెర చెరువునకు చెందిన 8 ఎకరాల 24 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. సర్వే నెంబర్లు 489, 485, 458, 484, 492, 489 భూముల్లో భవనాలు, షెడ్స్, వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని.. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 7 రోజుల్లో కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు.