
నారాయణపేట, వెలుగు : హనుమంతరావు చతుర్విద జల ప్రక్రియతో రైతులు ఏటా 3 పంటలు పండించుకోవచ్చని మర్రిచెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం ట్రస్ట్ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ ప్రక్రియపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. హనుమంత్ చతుర్విద ప్రక్రియ రాజస్థాన్‌లోని 33 జిల్లాలో మంచి ఫలితాలు ఇచ్చిందని, ఎడారి ప్రాంతంలో కూడా పంటలు పండిస్తున్నామని రాజస్థాన్ రివర్ బోర్డు అథారిటీ ఇంజినీర్శుక్లా వివరించారు.
అనంతరం మర్రిశశిధర్‌రెడ్డి మాట్లాడుతూ 2004లో మొదట సంగారెడ్డి జిల్లా గొట్టిగారిపల్లెలో ప్రయోగించామని, ఎంత కరువు వచ్చినా నేటికీ నీరు సమృద్ధిగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేసే కన్నా ఈ ప్రక్రియను అమలు చేస్తే ప్రతిఒక్క రైతు మంచి పంటలు పండించుకొవచ్చన్నారు. నారాయణపేట జిల్లాలో ఎకరానికి రూ.15 వేల చొప్పున3 లక్షల ఎకరాల్లో ప్రక్రియ చేస్తే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.
ఇది ప్రధాన లిఫ్ట్ ప్రాజెక్టుకయ్యే ఖర్చుతో పోలిస్తే కేవలం 2శాతం మాత్రమేనన్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని, రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో చతుర్విద జల ప్రక్రియ అమలయ్యేవిధంగా ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో రైతులు లాభపడే వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని గురించి కేంద్రంతో మాట్లాడుతామన్నారు.
ఎమ్మెల్యే పర్ణికారెడ్టి మాట్లాడుతూ ఈ విషయంపై మంత్రులతో చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, వాటర్షెడ్నిపుణులు అప్సర్, ఇస్రో ఇంజినీర్ సురేశ్, నాబార్డ్అధికారి షణ్ముకాచారి, జిల్లా రైతు కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ పాల్గొన్నారు.