సిటీ శివారులో పోలీస్ మార్చురీ పెట్టాలి : మర్రి శశిధర్ రెడ్డి

సిటీ శివారులో పోలీస్ మార్చురీ పెట్టాలి : మర్రి శశిధర్ రెడ్డి
  • గాంధీ మార్చురీ కంపు సమస్యకు ఇదే పరిష్కారం
  • సీఎం రేవంత్​రెడ్డికి లెటర్ ​రాసిన మాజీ మంత్రి మర్రి

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి భరించలేని కంపు వస్తోందని, ఆ సమస్యకు చెక్​పెట్టాలంటే సిటీ శివారులో ప్రత్యేకంగా పోలీస్ మార్చురీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన స్థానిక బీజేపీ నేతలతో గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.రాజారావును కలిశారు. గాంధీ మార్చురీ సమస్యపై చర్చించారు. మార్చురీ కంపుతో పద్మారావునగర్, అభినవ్ నగర్ కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారని శశిధర్ రెడ్డి చెప్పారు. సూపరింటెండెంట్ స్పందిస్తూ.. హాస్పిటల్​మార్చురీలోని ఫ్రిడ్జ్​లు, ఎయిర్​కండిషనర్లు, బాక్సులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సాధారణ డెడ్​బాడీల నుంచి ఎలాంటి కంపు రావడం లేదని చెప్పారు.

 గుర్తుతెలియని డెడ్ బాడీలతోనే సమస్య అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తుతెలియని డెడ్​బాడీలను, వారి సంబంధికులు గుర్తించేందుకు కనీసం 3 రోజులు మార్చురీలో భద్రపరచాల్సి వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో కుళ్లిపోయి, దుర్వాసన వ్యాపిస్తోందన్నారు. సిటీ శివారులో గుర్తుతెలియని డెడ్​బాడీల కోసం ప్రత్యేకంగా పోలీస్​ మార్చురీలు ఏర్పాటు చేస్తే సమస్య ఉండబోదన్నారు. 

దీంతో మర్రి శశిధర్​రెడ్డి శివారులో పోలీస్​ మార్చురీ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్​రెడ్డికి లెటర్​రాశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శశిధర్​రెడ్డి వెంట బీజేపీ నాయకులు చంద్రపాల్ రెడ్డి, హరినాథ్​, శీలం శివలింగం, గుంటి సత్యనారాయణ, రాజీవ్​ దేశ్​పాండే తదితరులు ఉన్నారు.