పెళ్లికి నిరాకరిస్తున్న యువత

జీవితంలో పెళ్లి చాలా ప్రధానమైనది. పెళ్లీడు రాగానే మూడు ముళ్లు వేయించడం వారి నుంచి తర్వాత తరాన్ని ఆశించడం అనాదిగా జరుగుతున్న సాంప్రదాయం. ఐదు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. పారిశ్రామిక విప్లవం, ప్రపంచీకరణ, ఆర్థిక స్వేచ్ఛ, ప్రైవేటీకరణ, కార్పొటీకరణ, సాంకేతిక విప్లవం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం వల్ల పెళ్లి చేసుకునే వయసు 30 ఏండ్ల నుంచి 40కి మారింది. మారుతున్న జీవన విధానాల ప్రకారం ఉన్నత చదువులు చదివే యువత సరైన సమయంలో పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. పెళ్లి అంటే భారం అని, అది ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు, వ్యక్తి గత స్వేచ్ఛకు ఆటంకం అనే భావన వారిలో ఉంది. ఇదీ గాక ఒంటరి జీవితానికి అలవాటు పడటం, సహజీవనం అన్న సంస్కృతి పెచ్చు మీరడంలాంటి పరిస్థితులు కూడా యువతకు పెళ్లి మీద శ్రద్ధ లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దేశంలో పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం(మినిస్ట్రీ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ అండ్ ​ప్రోగ్రామ్​ ఇంప్లిమెంటేషన్) ఇటీవల జారీ చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ‘జాతీయ యువజన విధానం–2014’ ప్రకారం 15 నుంచి 29 ఏండ్ల వయసు వారిలో పెండ్లి కాని వారు17 శాతం ఉంటే, 2019 నాటికి 23 శాతానికి పెరిగారు. ఇదే సమయంలో వివాహం కాని పురుషుల సంఖ్య 20.8 నుంచి 26.1 శాతానికి, పెండ్లి కాని యువతుల సంఖ్య 13 నుంచి19 శాతానికి పెరిగింది. పెండ్లి కాని యువకుల సంఖ్య దేశంలో జమ్మూ కాశ్మీర్​లో ఎక్కువ ఉన్నట్లు కేంద్రం తాజా రిపోర్టులో పేర్కొంది.

కారణాలు ఏమైనా..
దేశంలో పెండ్లి కాని యువత పెరగడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. మొట్టమొదటగా ప్రస్తుత యువతలో చాలా మందిని వెంటాడుతున్న సమస్య ఆర్థిక అస్థిరత. అది కరోనా మహమ్మారి కారణంగా మరింత తీవ్రమైంది. నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువ ఉన్న కుటుంబాల యువతీయువకులు ఇప్పుడున్న ఖర్చులు, ధరల దృష్ట్యా పెళ్లి గురించి పెద్దగా ఆలోచించరు. సంపన్న కుటుంబాల విషయంలో ఇది మరోలా ఉండొచ్చు. వైవాహిక ప్రాధాన్యం పరంగా చూస్తే.. నేటి యువతీ యువకులకు సహజీవనం, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ డేటింగ్ లాంటివి చాలా దగ్గరవుతున్నాయి. దీంతో వారు వయసు పెరుగుతున్నా.. వైవాహిక జీవితం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి గానీ, అమ్మాయి గానీ తనకు కాబోయే వ్యక్తి  ఆదాయ నేపథ్యం, తరగతి, హోదా, విద్య లాంటివి ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నారు. వాటి కోసం వేచి చూసే సందర్భంలోనూ పెండ్లి కాని వారి సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏమైనా.. సరైన వయసులో పెండ్లి జరిగితేనే జీవితం ప్రశాంతంగా సాగుతుందని వైద్యారోగ్య నిపుణులు అంటున్నారు.

యువత మేల్కోవాలి
ఓ ప్రైవేటు సంస్థ పెళ్లీడు వయసు తదితర అంశాలపై 8 ఏండ్ల పాటు సర్వే చేసి పలు కీలక అంశాలు వెల్లడించింది. 24 నుంచి 28 ఏళ్ల లోపు వయసులో పెళ్లి చేసుకుంటున్న వారిలో సంతాన లేమి, ఆర్థిక, ఉద్వేగ, మానసిక సమస్యలు, పని ఒత్తిళ్లు తక్కువగా కనిపించినట్లు తేలింది. ఆ వయసులో పెండ్లి చేసుకున్న వారు సంసార జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నట్లు పేర్కొంది. పెండ్లి వాయిదాలతో కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నా, నష్టాలు కూడా ఎక్కువేనని సంస్థ వెల్లడించింది. ఏది ఏమైనా దేశంలో పెండ్లి కాని యువత పెరుగుతుండటం ఆందోళనకరం. ఆరోగ్యవంతమైన, ఆర్థిక భారతాన్ని నిర్మించాలంటే సరైన వయసులోనే యువత పెండ్లిళ్లు చేసుకోవాలి. సకాలంలో పెళ్లి సత్వరాభివృదికి, సుస్థిరాభివృద్ధికి సామాజిక మూలధనం అన్న సత్యాన్ని మరువకూడదు.