కవర్ స్టోరీ : చదువుకంటే పెండ్లే ఖరీదు

కవర్ స్టోరీ : చదువుకంటే పెండ్లే ఖరీదు

కూతురి పెండ్లికి బాగానే ఖర్చు చేసినట్టున్నవ్ రామయ్య..’’ 
అదేముందిలే గోవిందు.. నేనేమైనా అంబానీనా? లేకపోతే సెలబ్రిటీనా? కోట్లలో ఖర్చు పెట్టనీకి. ఏదో.. లక్షల్లో ఖర్చుపెట్టిన.’’
నీ కూతురి చదువుకి కూడా అంత ఖర్చు అయ్యుండదు కదా.’’
ఎంత చదివినా.. పెండ్లి జెయ్యక తప్పదు కదా! జీవితంలో ఒక్కసారి చేసే వేడుక. అందుకే ఖర్చుకు ఎనకాడలె.’’
నువ్వన్నది నిజమే.. కానీ, పెండ్లి కోసం అప్పులు అయ్యాయని విన్నా. అప్పుచేసి చేయాల్సినంత అవసరం ఉండెనా? ఉన్నదాంట్లో చేస్తే పోయేదిగా...’’
అట్లెట్ల జేస్తం గోవిందు..?  
నా దగ్గర డబ్బు లేకపోవచ్చు. గానీ.. పరువు, ప్రతిష్టలకు భంగం కలగకూడదు. మన చేతిల అంత డబ్బు ఉంటదా? అవసరం వస్తే అప్పో సొప్పో జెయ్యాలె. అప్పు పుట్టలేదనుకో... బ్యాంకులో లోన్​ తీసుకునైనా పెండ్లి మాత్రం ఘనంగా చేయాలె. మరి రామయ్య కూతురి పెండ్లి అంటే ఎట్ల ఉండాలె... జనాలు ఒక ఏడాదైనా జెప్పుకోవాలె ...’’

ఇది ఒక్క రామయ్య ఇంటి విషయమే కాదు. మన దేశంలో చాలా ఇళ్లల్లో ఉండేదే ఈ పెండ్లి ఖర్చు తిప్పలు. ఒకరకంగా చెప్పాలంటే ఎవర్​గ్రీన్​ టాపిక్​. లేటెస్ట్​ ట్రెండింగ్ టాపిక్​ కూడా. ఎందుకంటే... అంబానీ చిన్న కొడుకు అనంత్​ అంబానీ పెండ్లి ఖర్చు గురించి రోజూ వార్తల్లో ఉండటం వల్లే. పెండ్లికి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అయిందట! అనే మాటలు అక్కడాఇక్కడా వినిపిస్తున్నాయి. అయితే.. ఒక్క అంబానీ ఇంట్లోనే కాదు.. భారతదేశంలో జరిగే ప్రతి పెండ్లికి భారీగానే ఖర్చు పెడుతున్నారు. కొందరైతే పెండ్లి ఖర్చు వాళ్ల తాహతుకు మించి పెడుతున్నారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ మధ్య ఒక రిపోర్టు కూడా విడుదలైంది. 

అందు​లో ఏముందంటే..

‘ఇన్వెస్ట్​మెంట్ బ్యాంకింగ్​ అండ్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ జెఫరీస్​’ భారతదేశంలో జరిగే పెండ్లి​ బడ్జెట్​ గురించి ఒక రిపోర్టు ఇచ్చింది. భారతదేశంలో పిల్లల ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయ్యే ఖర్చు కంటే పెండ్లికి రెండింతలు ఖర్చు పెడుతున్నారనేది ఆ రిపోర్ట్​ సారాంశం! దేశంలో వివాహాల సగటు ఖర్చు  దాదాపుగా 12.5 లక్షల రూపాయలు. అమెరికాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ దేశంలో చదువు మీద పెట్టే ఖర్చు ఎక్కువ. ఇండియాలో తలసరి ఆదాయం 2.4 లక్షల రూపాయలు. దానికంటే పెండ్లిళ్లపై పెట్టే ఖర్చు దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఒక యావరేజ్ ఫ్యామిలీ ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతేకాదు.. ఇండియాలో పెండ్లి ఖర్చు– జీడీపీ శాతం చాలా దేశాల కంటే ఎక్కువ. 

వార్షిక ప్రాతిపదికన భారత్‌‌లో సుమారు 80 లక్షల నుంచి కోటి వరకు పెండ్లిళ్లు జరుగుతున్నాయి. చైనాలో ఈ సంఖ్య 70 నుంచి 80 లక్షల వరకు ఉంది. యూఎస్ఏలో 20 నుంచి 25 లక్షల వరకే ఉంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అగ్రరాజ్యం అమెరికాలో పెండ్లిళ్ల కోసం 70 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని మన దేశంతో పోల్చితే దాదాపు రెట్టింపు ఖర్చు చేస్తున్నారు అంటోంది ఈ రిపోర్ట్​.

అయితే భారతీయ వెడ్డింగ్ ఇండస్ట్రీ వల్ల ఇతర రంగాలైన నగలు, బట్టలు, ఫుడ్​, ట్రావెల్​తోపాటు పెండ్లితో ముడిపడిన ఇతర రంగాలు కూడా డెవలప్​ అవుతున్నాయి. నగల పరిశ్రమలో దాదాపు సగానికి పైగా ఆదాయం పెండ్లి ఆభరణాల నుంచే. మొత్తం బట్టల ఖర్చులో10 శాతం పెండ్లి బట్టల నుండి వస్తోంది. అదే పెండ్లి ఖర్చులో 25 శాతం ఆభరణాలు, 20 శాతం క్యాటరింగ్, ఈవెంట్​కి15 శాతం వెళ్తోంది.

పెండ్లి ఖర్చు వల్ల కొన్ని రంగాలు బాగుపడుతున్నాయనేది వాస్తవం. కానీ అందరి దగ్గర లగ్జరీగా ఖర్చుపెట్టేంత డబ్బు ఉండదు. అయినప్పటికీ పేద, ధనిక తేడా లేకుండా ఎందుకు అంతలా ఖర్చు పెడుతున్నారు? దానికి కారణాలు ఏంటి? అనే వివరాల్లోకెళ్తే ఈ విషయాలు తెలిశాయి.
ఇండియాలో పెండ్లి అంటే... అదో పండుగ. ఖర్చుకు అస్సలు వెనుకాడని విషయం కూడా అదే. పెండ్లికి అంత ఖర్చు ఎందుకు? అదేదో చదువుకు పెట్టొచ్చు కదా అంటే... అది కుదరదు. పెండ్లి ఖర్చు వెనక కారణాలు ఉన్నాయి.

సామాజిక ఒత్తిడి

భారతదేశంలో పెండ్లికి ఎక్కువ ఖర్చు చేయడానికి మొదటి కారణం.. చుట్టూ ఉన్న సమాజం. సమాజంలో పరువు, ప్రతిష్టలను నిలబెట్టుకునేందుకు తల తాకట్టు పెట్టయినా సరే ఘనంగా పెండ్లి చేయాలనుకుంటున్నారు పేరెంట్స్. అలా చేయలేదంటే రేపటి రోజున సమాజంలో తమని చిన్న చూపు చూస్తారేమో.. అనే భావన పేరెంట్స్ మనసులో ఉంటోంది. అదే ఆడపిల్ల తల్లిదండ్రులయితే.. పెండ్లి గ్రాండ్​గా చేయకపోతే వియ్యాల వారి ముందు మాట వస్తుందనే ఆలోచనతో విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా సొసైటీ గురించి ఆలోచించి.. ఒత్తిడికి లోనవుతున్నారు. అదే ఖర్చు పెంచడానికి దారితీస్తోంది. అలా పెండ్లి ఖర్చుకి సామాజిక ఒత్తిడి మొదటి కారణంగా ఉంటోంది. 

వరకట్నం

భారతదేశంలో కట్నం అనేది ఒక సంప్రదాయంలా మారింది. నిజానికి కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా తప్పు. అయినా కానుకల  పేరుతో డబ్బు, బంగారు నగలు, కారు, ఖరీదైన ఫర్నీచర్, ఇల్లు లేదా ఫ్లాట్, భూమి ఇస్తుంటారు. అంతేనా.. వంట పాత్రల నుంచి ఇల్లు ఊడ్చే చీపురు వరకు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ‘అన్ని సామానులు ఇచ్చేంత స్థోమత లేదు’ అనే విషయాన్ని బయటకు చెప్పలేరు తల్లిదండ్రులు. ఎందుకంటే ఉన్నోళ్లయినా, లేనోళ్లయినా ‘సంప్రదాయం’ పాటించాల్సిందే. పాతరోజుల్లో ఇంటికి అవసరమైన సామాను పరిమితంగానే ఉండేది. కానీ ఇప్పుడు వాషింగ్ మెషిన్, డిష్​వాషర్​,  ఫ్రిజ్, టీవీ, గ్రైండర్​, రైస్ కుక్కర్​... ఇలా  మార్కెట్లోకి కొత్తగా ఏ ప్రొడక్ట్​ వస్తే అది పెండ్లి కూతురికి సారెగా మారిపోతోంది.

 ఇవన్నీ ఒక ఎత్తయితే... ఇప్పుడున్న ట్రెండ్​కి తగ్గట్టు గ్రాండ్​గా పెండ్లి చేసుకోవాలని నేటి తరం ఆలోచన. పెండ్లికి ముందు బ్యాచిలర్ పార్టీతో మొదలు.. ప్రి–వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ ఫంక్షన్​... తర్వాత పెండ్లి. అంతటితో ఆగుతుందా... మోడర్న్​ వెడ్డింగ్ ఈవెంట్ పేరిట పోస్ట్​ వెడ్డింగ్ షూట్, రిసెప్షన్ చేస్తారు. ఆపై ఆఫీస్​ కొలీగ్స్​కు ఓ పార్టీ, క్లోజ్​ ఫ్రెండ్స్​కు మరో పార్టీ అంటూ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కొత్త సంప్రదాయాలుగా మారాయి అనొచ్చు. అయితే ఇలాంటి  పార్టీలు, ఫంక్షన్లకు పెట్టే ఖర్చయినా పైకి కనిపిస్తుంది.. కాని కనపడని ఖర్చులు ఇంకా ఉన్నాయి. వాటిలో  ప్రధానంగా ఖర్చయ్యే విషయాలు ఇవి...

థీమ్ వెడ్డింగ్ : ఈ మధ్య థీమ్ వెడ్డింగ్స్ ట్రెండ్​ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ కోరుకుంటున్నారు. పెండ్లి చేసుకోబోయే జంట ఆలోచనలకు తగ్గట్టు ఉండేలా.. ఖరీదైనవి, భారీగా కనిపించేవి ఎంచుకుంటున్నారు. థీమ్ వెడ్డింగ్స్​లో ఒకరు రాజుల కాలం నాటి సెట్టింగ్ వేస్తే.. మరొకరు ట్రెండీగా ఉండాలి అంటున్నారు. ఇలా ఏదో ఒక ఎలిమెంట్​ కలుపుకుంటూ ఖర్చు పెంచుకుంటున్నారు కొందరు. వీళ్లకి పూర్తి భిన్నంగా ఎకో ఫ్రెండ్లీ పెండ్లిళ్లు చేసుకుంటున్నారు ఇంకొందరు. వీటి వల్ల ఖర్చు కాస్త కంట్రోల్​లో ఉండే అవకాశం ఉంది.
 
ఈవెంట్ మేనేజ్​మెంట్ : ‘ఇల్లు కట్టి చూడు పెండ్లి చేసి చూడు’ అనే మాట మామూలుగా వచ్చింది కాదు. ఇల్లు కట్టాలంటే ఎంతమంది చేతులు పడాలో... అలాగే పెండ్లి చేయాలంటే కూడా అవసరం. బంధువులు, స్నేహితులతో పాటు అయిన వాళ్లు, కాని వాళ్లు ఎంతో మంది సాయం కావాల్సి ఉంటుంది. తలా ఒక పని పంచుకుంటేనే పనులన్నీ సజావుగా సాగుతాయి. కాకపోతే మునుపటిలా ఇప్పుడు పనులు పంచుకునే పరిస్థితులు లేవు.

ఉద్యోగాలు, వ్యాపారాలు... అంటూ పెండ్లి పనులకు టైం ఇవ్వడానికి వీలుపడట్లేదు. పెండ్లి పనుల్లో  ఏర్పడిన ఆ గ్యాప్​ ఫిల్​ చేసేందుకు వచ్చినవే ఈవెంట్ మెనేజ్​మెంట్ సంస్థలు. తమలపాకు నుంచి అరిటాకు వరకు అన్ని పనులు ఆ సంస్థ వాళ్లే చూసుకుంటారు. ఆ పనులన్నింటికీ ఇంత బడ్జెట్​ అవుతుందో వాళ్లు చెప్తారు. ఆ డబ్బుని ​ వాళ్ల చేతిలో పెడితే... పెండ్లి లేదా ఫంక్షన్​ టైంకి వెళ్తే చాలు. వేడుకలు చేసేవాళ్లు కూడా ఏ శ్రమా లేకుండా అతిథుల్లాగే ఎంజాయ్​ చేయొచ్చు. ఈ కల్చర్ ఇప్పుడు ఊళ్లకు కూడా పాకింది. 

వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్​: పెండ్లికి ఆయా మతాల ట్రెడిషన్​ బట్టి బట్టలు తీసుకుంటారు. అలాగే పెండ్లికి వేసుకునే బట్టల రంగులు కూడా కొన్నే ఉంటాయి. కానీ ఇప్పుడు బట్టల విషయంలో కూడా ట్రెండ్​ మారింది. వధూవరుల డ్రెస్​లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇద్దరి బట్టలు ఒకే రంగులో, ఒకేలాంటి డిజైన్​తో ఉండేలా తయారు చేయిస్తున్నారు. అలా వాళ్ల ఇష్టాలకు అనుగుణంగా వెళ్లడం బాగానే ఉంది.. కానీ పెండ్లి బట్టల ఖర్చుకు కూడా వెనకాడట్లేదు. అలాకాకుండా బడ్జెట్​లో మనసుకు నచ్చిన బట్టలు ఎంచుకుంటే ఖర్చు తగ్గుతుంది.. కోరికా తీరుతుందని ఆలోచించే వాళ్ల సంఖ్య తగ్గుతోంది.

దావత్​: పార్టీ అంటే మందు ఉండాల్సిందే అన్నట్టు..‘జీవితానికి టర్నింగ్​ పాయింట్​లాంటి పెండ్లిలో మందు పార్టీ లేకపోతే ఎట్లా?’ అంటారు చాలామంది. పెండ్లి కొడుక్కి లేదా వాళ్ల ఫ్యామిలీలో ఎవరికీ అలవాటు లేకపోయినా ఆ పార్టీ తప్పనిసరిగా మారింది. అంత ఖర్చు పెట్టి పెండ్లి చేస్తున్నారు. అతిథులకు మందు పార్టీ ఇవ్వకపోతే పరువు పోతుందని భావిస్తున్నారు కొందరు. ఇంకొందరైతే బయటకు తెలిసేటట్టు కాకపోయినా గుట్టుగా మందుపార్టీ ఏర్పాటు చేస్తుంటారు. ఏదేమైతేనేం పెండ్లి రోజు మందుబాబులకు పండుగే. 

మామూలుగా అయితే మందు తాగకూడదు అంటారు. కానీ, ఇలాంటప్పుడు మాత్రం తాగేవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు కల్చర్​లో ఇది ఒక భాగంలా అయిపోయింది. దాంతో దీనికి ఫుల్​స్టాప్​ పెట్టడం కష్టమవుతోంది.అలాగే డీజే, సంగీత్, బారాత్​ వంటి రకరకాల పేర్లతో ఎంటర్​టైన్​మెంట్​ ప్రోగ్రామ్స్​ ట్రెండ్​గా మారాయి. వినోదం కోసం పెడుతున్న ఈ ఖర్చు కూడా ఎక్కువే. దానికి బదులు పాటలు పెట్టుకుని అందరూ డాన్స్ చేయొచ్చు. సరదా యాక్టివిటీలు, గేమ్స్ ఆడుకోవచ్చు. బంధువులంతా కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు.

ఇలా బంధాలు బలపడే, ఖర్చులేని  ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటి గురించి ఆలోచించడంలేదు. అలాగే ‘ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి.. అంగరంగ వైభోగంగా పెండ్లి చేయాలి’ అనే సినిమా డైలాగుల ప్రభావం లేకపోలేదు. సినిమాల్లో పెండ్లిళ్లకు వేసే భారీ సెట్టింగ్​ల వ్యవహారం నిజ  జీవితంలో వర్కవుట్​ కాదనే విషయం చాలామందికి అర్థం కావడంలేదు. నిజానికి తెరమీద చూసేవి జరగాలని కోరుకోవడం అమాయకత్వానికి, అవివేకానికి నిదర్శనం. ఇది వాస్తవ జీవితం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 

పెండ్లి అంటే పండుగ

భారతదేశ ప్రజల ఆచారాలు, సంప్రదాయాల్లో భిన్నత్వం కనిపిస్తుంది. భారతీయ వివాహాలు ప్రతిచోటా ఒకే ఉత్సాహంతో జరుపుకుంటారు.

అప్పుడు మొదలైన మార్పు

భారతదేశంలో1991లో ఆర్థిక సంస్కరణలు జరిగాయి. అందులో ఒకటి సరళీకరణ (లిబరలైజేషన్). అప్పటి నుంచే పెండ్లిళ్లలో గొప్పదనం చాటే ప్రదర్శనలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ ఖర్చు అవుతోంది. కారణం.. ఫొటోగ్రాఫర్లు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు తీసుకోవడం, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్​లను ఎంచుకోవడం, డెస్టినేషన్, థీమ్ వెడ్డింగ్​ల వైపు మళ్లడం ఆనవాయితీ అయింది.  డిజైనర్ లేబుల్స్​, పెళ్లి దుస్తుల ఖర్చు రూ.15 వేల నుంచి రూ. 4 లక్షల వరకు పెరిగింది. స్టార్ కొరియోగ్రాఫర్స్​, పార్టీల కోసం లగ్జరీ హోటల్స్​ బుకింగ్​.. వంటివి పెండ్లి ఖర్చును విపరీతంగా పెంచేసింది. అతిథులకు విలాసవంతమైన ఆతిథ్యం ఇవ్వడం హోదాకు సింబల్​గా మారింది. 

జీవితకాల సంపాదనలో 20 శాతం

ఒక వ్యక్తి  జీవితకాల సంపాదనలో 20% వరకు ఖర్చు చేసేది పెండ్లికే. ముఖ్యంగా ఆడపిల్లల కుటుంబంపై ఇది విపరీతమైన ఆర్థిక భారాన్ని వేస్తోంది. అందుకు నిదర్శనం వరకట్న మరణాలే!1999 – 2018 మధ్య దేశంలో జరిగిన వివాహిత స్త్రీల హత్యల్లో వరకట్న మరణాలు 40% –50% వరకు ఉన్నాయి. వరకట్నం అధికారికంగా నిషేధించినప్పటికీ, వరుడి కుటుంబ స్థితికి తగ్గట్టు డబ్బు తీసుకోవడం జరుగుతూనే ఉంది. 

ఎక్కువ ఖర్చు...

మనదేశంలో 2023 డిసెంబర్ నెల​లో దాదాపు 32 లక్షల పెండ్లిళ్లు జరిగినట్లు ఒక అంచనా. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సోస్ ఇండియాబస్​... పెండ్లికి సంబంధించిన విషయాల మీద స్టడీ చేసింది. దాని ప్రకారం టౌన్​ ప్రజల్లో పది మందిలో కనీసం ఏడు మంది ‘పెండ్లిళ్ల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం’ అని చెప్పారు. అదే నగరాల్లో మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. ఇక్కడ పది మందిలో నలుగురు ‘గ్రాండ్ వెడ్డింగ్ మన సంప్రదాయం’ అని నమ్ముతున్నారు. 36% మంది ఇలాంటి పెండ్లిళ్లు కొంతవరకు అవసరమే అన్నారు.

కాగా పది మందిలో ఇద్దరు భారీ బడ్జెట్ పెండ్లిళ్లు అనవసరం అన్నారు. 
ఇండియాలో పెండ్లి చిన్న వేడుకగా జరగడం చాలా అరుదు.-  కొవిడ్ ప్యాండెమిక్ లో మాత్రమే అలా జరిగాయి. అయితే పెండ్లి భారం ఆడపిల్ల తల్లిదండ్రుల మీద పడకుండా వధువు, వరుడి కుటుంబాలు పెండ్లి ఖర్చులు సమంగా పంచుకోవాలని 56% మంది సూచించారు. పెండ్లికి పెద్ద బడ్జెట్​ అక్కర్లేదు అనే వాళ్లలో 52% మంది పెండ్లి ఖర్చు అనవసరమైన ఒత్తిడి ఉండకూడదు అన్నారు.

లోన్.. ఇప్పుడిదే ట్రెండ్

‘పెండ్లి ఇప్పుడు చేసుకోండి.. డబ్బులు తర్వాత కట్టండి’ ఇదే పర్సనల్ లోన్ మార్కెట్​లో ట్రెండింగ్​. పెండ్లిళ్ల మీద లోన్లు తీసుకుంటే ఏడాదికి పది నుంచి 36 శాతం వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​లు వెడ్డింగ్ ఫైనాన్షియల్ సర్వీస్​లు అందిస్తున్నాయి. కొన్ని డిజిటల్ లెండింగ్ ప్లాట్​ఫామ్స్​ అయితే ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ఈ ఆఫర్లకి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పుణె, ముంబై నుంచి డిమాండ్ ఉంది. 
ఇక పెండ్లిళ్లు ఎక్కువగా ఏ దేశంలో జరుగుతున్నాయనేది చూస్తే... అందులో ఇండియానే ఫస్ట్. ఇక్కడ ఏటా దాదాపు పది మిలియన్ల పెండ్లిళ్లు జరుగుతున్నాయి. జనాభాలో 34 % మంది పెండ్లి వయసుకి వచ్చిన (20 –39)వాళ్లే ఉన్నారు. ప్రస్తుతానికి 28 కోట్ల మంది పెండ్లికాని వాళ్లు ఉన్నారనేది ఒక అంచనా. 

బడ్జెట్ తగ్గించాలంటే.. 

ప్రి–వెడ్డింగ్ ఫంక్షన్స్​ బడ్జెట్‌‌కు మించక్కర్లేదు. వేడుకలు చేసుకునేందుకు ఇల్లు చిన్నది అయితే... ఫ్రెండ్స్​, రిలేటివ్స్​ ఇళ్లని వేదికగా చేసుకోవచ్చు. వీకెండ్స్​లో, పెండ్లిళ్ల సీజన్​లో బడ్జెట్ పెరుగుతుంది. అందుకని మీ బడ్జెట్ ఎంత? ఖర్చు ఎంత? అనే విషయాల మీద అవగాహనకి రావాలి. పెండ్లి పొదుపు ఖాతా ఒకటి పెట్టుకుంటే అన్ని రకాలుగా మంచిది. అప్పుడు పెండ్లి ‘వేడుక’ అవుతుంది.

400 ఏళ్ల క్రితమే..

400 ఏండ్ల క్రితమే చరిత్రలో నిలిచిపోయేలా షాజహాన్ పెద్ద కుమారుడు దారా షికో పెండ్లి చేశాడు. ఆ పెండ్లికి అప్పట్లోనే రూ. 32లక్షలు ఖర్చు అయింది. అంటే ఇప్పటి కాలంలో వేల కోట్లతో సమానం. అంతేకాదు దారా షికో పెళ్లికి షాజహాన్ పెద్దకూతురు తన సొంతంగా 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ పెండ్లి కూతురి డ్రెస్​ ఖరీదు అక్షరాలా రూ.8 లక్షలు. దాదాపు 8 రోజులు పెండ్లి వేడుకలు జరిగాయి. 

పదహారు రోజుల పెండ్లి

పూర్వం ఊళ్లు విసిరేసినట్టు దూరంగా ఉండేవి. దాంతో రాకపోకలకు కష్టం అయ్యేది. అందుకని పదహారు రోజుల పెండ్లిళ్లు చేసేవాళ్లు. ఆ తర్వాత ఐదు రోజుల పెండ్లి... ఇది ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతోంది. పెండ్లికి చేసే తంతుని ఒక్కో రోజు ఒక్కోటిగా చేస్తున్నారు. ఐదు రోజులూ బంధువుల వచ్చి వెళ్తుంటారు. పెండ్లింట అతిథులకు భోజనాలు పెడుతుంటారు. అయితే, ఇప్పుడు ఆ ఐదు రోజుల కాస్తా మూడు రోజులకు, ఒక్క రోజుకు, ఒక్క పూటకు వచ్చేసింది.  

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెండ్లి 1981లో జరిగిన ప్రిన్స్ ఛార్లెస్,- ప్రిన్సెస్ డయానాది. వీళ్ల పెండ్లి ఖర్చు రూ. 916 కోట్లకు పైనే ఉంది. బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా ఎక్కువ మంది చూసిన ప్రోగ్రాం కూడా వీళ్ల పెండ్లే. దాదాపు 2.84 కోట్ల మందికిపైగా చూశారట. పెండ్లిలో డయానా వేసుకున్న డ్రెస్ విలువ రూ. 4.1 కోట్లు. 

వందలకోట్ల పెండ్లిళ్లు ఇవి..
 

  •     కర్నాటకకు చెందిన మాజీ మంత్రి, జనార్ధనరెడ్డి కుమార్తె వివాహానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. పెండ్లి కూతురి చీర ఖరీదు 17 కోట్లు. చీరపై బంగారు పోగులతో థ్రెడ్ వర్క్ చేశారు. ఆమె వేసుకున్న బంగారం, వజ్రాలతో చేసిన నగలు దాదాపు ఐదు కోట్లు. వేదిక నుంచి బళ్లారిలో భోజనాలకు వెళ్లేందుకు 15 హెలికాప్టర్లు, రెండు వేల ట్యాక్సీలు వాడారు.
  •      బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ పెండ్లికి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు అయిందట! 
  •      2004లో సహారా గ్రూప్ మాజీ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంత్, సీమాంటో రాయ్‌‌ల వెడ్డింగ్ వేడుకలకు రూ.554 కోట్లు ఖర్చు అయిందట. 
  •       ఉక్కు వ్యాపారవేత్త ప్రమోద్ మిట్టల్ కుమార్తె సృష్టి 2013లోఇన్వెస్ట్​మెంట్ బ్యాంకర్ గుల్‌‌రాజ్ బెహ్ల్‌‌ను పెండ్లి చేసుకుంది. దీనికి సుమారు రూ.500 కోట్లు ఖర్చయిందట. ఈ ఈవెంట్ స్పెయిన్‌‌లోని బార్సిలోనాలో మూడు రోజులు జరిగింది.

అనంతుడి పెండ్లి ఖర్చు
 
ఫైనాన్షియల్ ఎక్స్​ప్రెస్ రిపోర్ట్​ ప్రకారం, అంబానీ ఫ్యామిలీ నెట్ వర్త్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. రాధిక మర్చంట్ ఫ్యామిలీ నెట్​ వర్త్ 755 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన పెండ్లిగా ప్రచారం పొందిన అనంత్​ అంబానీ – రాధిక మర్చంట్​ల పెండ్లికి ముందు నుంచి పెండ్లి పూర్తయ్యే వరకు జరిగిన ఖర్చు ఇది...

  • రాజస్తాన్​లోని నథ్​ద్వరలో 29 డిసెంబర్​ 2022న శ్రీనాథ్​జీ టెంపుల్​లో రోకా వేడుక జరిగింది. ఆ గుడిలో ఒక రోజంతా రాజ్​ భోగ్​ శ్రింగార్​ పద్ధతిలో ఆ వేడుకలు చేశారు. ఈ వేడుకకి క్లోజ్ ఫ్రెండ్స్​ మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత గతేడాది జనవరి18న మెహందీ సంబరాలు జరిగాయి.
  •      జనవరి19న ముంబయిలోని యాంటిలాలో 15 వేల కోట్ల రూపాయలతో నిశ్చితార్థం చేశారు. ఆ ఈవెంట్​కి బాలీవుడ్​ నుంచి షారుక్​​ ఖాన్​, అలియాభట్​, దీపిక పదుకొణె, రణ్​వీర్ సింగ్ వంటి సినీ నటులు పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ గుజరాతీల ‘గోల్ ధన’ సంప్రదాయం జరిగాయి. 
  •      ఫిబ్రవరి16న జామ్​నగర్​లోని అంబానీ ఫామ్​హౌజ్​లో ‘లగాన్ లఖ్​వను’ పేరుతో ప్రి–వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగింది. జూన్​లో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ పంచారు. వెండి కోవెలలో బంగారు విగ్రహాలతో ఉన్న ఎరుపు రంగు బాక్స్​లో ఆహ్వానం ఉంది. మొదటి ఇన్విటేషన్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్​ టెంపుల్​లో శివుడి పాదాల దగ్గరపెట్టారు నీతా అంబానీ.
  •       మార్చి1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ప్రి–వెడ్డింగ్ సెలబ్రేషన్​కి మొదటిరోజు బాలీవుడ్ నటీనటుల​తోపాటు బిల్ గేట్స్, మార్క్​ జుకర్ బర్గ్​ సహా బడా వ్యాపారవేత్తలు చాలామంది ఇందులో పాల్గొన్నారు. అలాగే పాప్​ స్టార్ రిహన్నా కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. అందుకుగాను ఆమెకి దాదాపు74 కోట్ల రూపాయలు ఇచ్చారు.
  •      రెండో రోజు ‘వాక్ ఆన్​ ది వైల్డ్ సైడ్’ థీమ్​తో మూడువేల ఎకరాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘వంతారా’ని పరిచయం చేశారు. అతిథులకు జామ్​నగర్ రిఫైనరీ కాంప్లెక్స్​లో ఉన్న వంతారా టూర్​ చూపించారు. అదే రోజు రాత్రి ‘మేళా రోగ్’ పేరిట చేసిన సంగీత్​ కార్యక్రమంలో పాపులర్ సింగర్ దిల్జిత్​ దొసాంజే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు పేమెంట్ అందిందట!
  •       చివరి రోజు ‘టుస్కర్ ట్రైల్స్’ థీమ్​తో సెలబ్రేషన్ అందులో హస్తాక్షర్​ వేడుక జరిగింది. అందులో మ్యుజీషియన్స్ అయిన అర్జిత్ సింగ్, లక్కీ అలీ, శ్రేయా గోషల్, ఉదిత్ నారాయణ్​ పాటలతో వీనులవిందు చేశారు. ‘చమ్మక్​ చల్లో’ ఫేమ్​ ఎకోన్​ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. అతనికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు. 
  •       ఈ మూడు రోజుల వేడుకల ఖర్చు.. దాదాపు1259 కోట్ల రూపాయలు. ఈ వేడుకల్లో వంద మంది చెఫ్​లతో 500 వంటకాలు చేయించారు. 51 వేలమందికి విందు భోజనం ఏర్పాటుచేశారు. అందులో నిరుపేదలు కూడా ఉన్నారు.
  •       మార్చి 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు మరోసారి ప్రి–వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. అందులో ‘లా విటా ఇ ఉన్​ వియాగియో’(జీవితం ఒక ప్రయాణం) పేరుతో క్రూయిజ్​ షిప్​ జర్నీ చేశారు. అనంత్​ అంబానీ ఆరేండ్ల క్రితం రాధికకు రాసిన ప్రేమలేఖతో డిజైన్ చేసిన చీర కట్టుకుందామె.
  •       ఇటలీలో జరిగిన ప్రి– వెడ్డింగ్​ వేడుకల్లో ఆండ్రియా బోసెల్లి మ్యూజికల్ పర్ఫార్మెన్స్​ ఇచ్చారు.
  •       జులై 3న 50 మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేశారు. ఒక్కో పెండ్లి కూతురికి బంగారు మంగళసూత్రం, ముక్కెర, ఉంగరంతోపాటు వెండి మెట్టెలు, పట్టీలు బహూకరించారు.  ప్రతి జంటకు 1.01 లక్షల రూపాయల చెక్, ఏడాదికి సరిపడా సరుకులు, ఇంటి సామాగ్రి, ఫర్నీచర్ ఇచ్చారు. 
  •        జులై 4న గుజరాతీ సంప్రదాయం అయిన ‘మామెరు’ ఈవెంట్ రాధిక మర్చంట్​ ఫ్యామిలీ చేసింది. జులై 5న సంగీత్ ఘనంగా జరిగింది. పెండ్లి జులై12న, శుభ్ ఆశీర్వాద్​ జులై13న, మంగళ్ ఉత్సవ్ పేరిట వెడ్డింగ్ రిసెప్షన్​ జులై14న జరిగాయి. ఈ వేడుకలన్నింటికీ జియో వరల్డ్​ సెంటర్స్, జియో వరల్డ్ గార్డెన్ వేదిక అయ్యాయి. వీటికి ఒక రోజుకి యావరేజ్​గా15 లక్షల రూపాయల అద్దె. కాగా వేడుకల్లో భాగం చేసిన జస్టిన్ బీబర్ అనే సింగర్​కి 83 కోట్ల రూపాయల ఖర్చయిందట!

మార్పు రావాలంటే..

ముందుగా అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్లు 60%శాతం.అప్పు చేసేవాళ్లు 30 శాతం. ఆర్థిక పరిస్థితుల వల్ల 20% మంది పెండ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి.ఈ విషయంలో మార్పు రావాలంటే.. పిల్లలు బాగా చదువుకుంటే జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు నమ్మాలి. జీవితం​లో ఇండిపెండెంట్​గా ఎదిగే స్కిల్స్ వాళ్లకి నేర్పించాలి.

ఈ ప్రశ్నకు బదులేది?

గ్రాండ్​గా చేసే పెండ్లిళ్లలో దాదాపు 40%  ఫుడ్​ వేస్ట్​ అవుతోంది. అలాకాకుండా జీరోవేస్ట్ వెడ్డింగ్ లేదా ఆర్గానిక్ వెడ్డింగ్ చేయొచ్చు.జీరో వేస్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్​తో కొందరు బడ్జెట్ తగ్గించుకుంటున్నారు. ఆ కోవలోనే కర్నాటకకు చెందిన పూర్వీ భట్, శమంత్​లు జీరో వేస్ట్ వెడ్డింగ్ చేసుకున్నారు. కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఈ పెండ్లి ఘనంగా జరిగింది. ఎక్కడా ప్లాస్టిక్​, అనవసరమైన వ్యర్థాలు కనపడలేదు. కొబ్బరి, ఆముదం, మామిడి తోటలతో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఇది పెండ్లి కూతురికి డ్రీమ్ వెడ్డింగ్​! న్యూట్రిషనిస్ట్, నేచురోపతి డాక్టర్​ అయిన​ పూర్వి చిన్నప్పటి నుంచి పెండ్లి గురించి కన్న కలను నిజం చేసుకుంది. 
 
పూర్వి పెండ్లి ఇలా జరిగింది

పెండ్లికి ధరించిన బట్టల్లో 80 శాతం వాళ్ల ఇంట్లో ఉన్నవే. 50 ఏండ్ల నాటి బామ్మ చీర కట్టుకుంది పూర్వి. మేకప్ తనే వేసుకుంది. హెయిర్​ స్టయిల్ ఫ్రెండ్స్​ చేశారు. చెరుకు గడలు, మామిడి తోరణాలు,  కొబ్బరి ఆకులతో మండపం కట్టారు. చేతులు కడుక్కున్న  నీళ్లను రీసైక్లింగ్​ చేశారు. స్టీలు పాత్రల్లో వంటలు, అరిటాకుల్లో భోజనాలు పెట్టారు. తడి చెత్తను వర్మి కంపోస్ట్​గా మార్చి పొలాలకు వేశారు. చెరుకు గడలను ముక్కలు చేసి ఆవులకు మేతవేశారు. వాటర్ క్యాన్లు కూడా రీయూజబుల్​వే వాడారు. మిగిలిపోయిన ఫుడ్​ని స్టీల్ బాక్స్​ల్లో పెట్టి ఇరుగుపొరుగు వారికి పంచారు. లోకల్​గా దొరికే పూలు, కాటన్ దారంతో పూలదండలు అల్లారు. రిటర్న్​ గిఫ్ట్స్​గా జ్యూట్ బ్యాగ్​లు ఇచ్చారు. రెండు రోజులు జరిగిన ఈ పెండ్లి వేడుకల తరువాత ఆ పరిసరప్రాంతాల్లో ఎక్కడా చెత్త అనేది కనిపించలేదు.

మనీష పరిమి