మధ్యప్రదేశ్‌లో లివ్ ఇన్ పార్ట్నర్ను చంపిన యువకుడు
దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి
కిందటేడాది మేలో మహిళను హత్య చేసినట్లు గుర్తింపు
భోపాల్: ఐదేండ్లుగా తనతో కలిసి ఉన్న లివ్ ఇన్ పార్ట్నర్ను దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్‌బాడీని ఫ్రిజ్ లో కుక్కి..ఇంటి ఓనర్‌కు ఊరెళ్లిందని చెప్పి మేనేజ్ చేశాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. ఆపై 8 నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య
ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్.. పింకీ ప్రజాపతి(30)తో ఐదేండ్లుగా కలిసి ఉంటున్నాడు. మొదట మూడేండ్లు ఉజ్జయినిలో ఉన్న ఈ జంట 2023లో దేవాస్ సిటీలోని బృందావన్ కాలనీకి షిప్ట్ అయింది. పెండ్లి చేసుకోవాలని పింకీ తరచుగా ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను చంపేయాలని సంజయ్ ప్లాన్ చేశాడు.
ఓ రోజు ఆమె నిద్రలో ఉండగా గొంతునులిమి చంపేశాడు. స్నేహితుడి సాయంతో డెడ్‌బాడీని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టాడు. ఇండోర్‌లో ఉండే ఇంటి ఓనర్‌కు బాధితురాలు పుట్టింటికి వెళ్లిందని చెప్పి కొద్దిరోజులు మేనేజ్ చేశాడు. ఆపై ఇల్లు ఖాళీ చేస్తున్నామని, కొంత సామాను తర్వాత తీస్కెళ్తానని చెప్పి ఫ్రిజ్‌ను అక్కడే వదిలి వెకేట్ చేశాడు.
ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఇల్లు కిరాయికి మరొకరు రాగా, ఓనర్ ఆ ఇంటి తలుపులు తెరిచి చూపించి, కరెంట్ ఆఫ్ చేసి మళ్లీ తాళం వేశాడు. ఆ మరుసటి రోజుకల్లా ఇంట్లోంచి దుర్వాసన వస్తోందంటూ చుట్టుపక్కలవాళ్లు చెప్పడంతో ఓనర్ మరోసారి ఇంటి తలుపులు తీసి చూడగా ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ కనిపించింది.
పోలీసులు స్పాట్‌ను పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా 8 నెలల కింద పింకీని తానే హత్య చేసినట్లు సంజయ్ అంగీకరించాడు. వాసన బయటికి రాకుండా ఫ్రిజ్ డోర్‌ను గట్టిగా కట్టేసి, ఆన్ లో ఉంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు.