
బెంగుళూరు: నటి రన్యా రావు కేసు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కర్నాటకలో కాక రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రన్యా రావును గత ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నానని.. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆమె నుంచి విడిపోయానని రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కాగా, 2025, మార్చి 3న గోల్డ్ స్లగ్మింగ్ చేస్తోండగా కెంపెగౌడ ఎయిర్ పోర్టులో నటి రన్యా రావు డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. బంగారం అక్రమ రవాణా వ్యవహరంలో నటి రన్యా రావుతో పాటు ఆమె భర్త జతిన్ హక్కేరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే రన్యా రావు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఈ క్రమంలో రన్యా రావు భర్త జతిన్ హక్కేరి కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం (మార్చి 17) హైకోర్టులో విచారణ జరిగింది. జతిన్ తరుఫున న్యాయవాది ప్రభులింగ్ నవదగి వాదనలు వినిపించాడు. తన క్లయింట్ నవంబర్‌లో రన్యా రావును వివాహం చేసుకున్నారని, కానీ డిసెంబర్ నుండి కొన్ని సమస్యల కారణంగా అనధికారికంగా విడిపోయారని కోర్టులో పేర్కొన్నారు.
ఈ కేసులో జతిన్ ప్రమేయం లేదని.. అతడిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తరపు న్యాయవాది మధురావు.. వచ్చే సోమవారం తమ అభ్యంతరాన్ని దాఖలు చేస్తామని తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మార్చి 24వ తేదీ వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు జతిన్ హక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.