చొప్పదండి, వెలుగు: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అనూష వివరాల ప్రకారం.. చొప్పదండిలోని సంతోష్‌నగర్‌కు చెందిన రాచకొండ మమత(25)కు కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాచకొండ లక్ష్మణ్‌తో 2019లో పెండ్లయింది. వారికి సంతానం కలగకపోవడంతో కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
లక్ష్మణ్ మమతను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు. ఈక్రమంలో ఆమె ఈ నెల 8న పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో బాధపడుతూ ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉండేది. గురువారం సాయంత్రం తల్లి పద్మ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు మమత ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.
కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దించగా అప్పటికే చనిపోయింది. అల్లుడు లక్ష్మణ్ వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.