అమెరికా అమ్మాయితో మళ్లీ పెళ్లి!

భద్రాచలం, వెలుగు: కొత్తగూడానికి చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని బుధవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఏలూరు రాజేశ్వరరావు, ఆంధ్రావాణి దంపతుల కొడుకు రామచంద్రరావు అమెరికాలో డాక్టర్. కొన్నేండ్లుగా కాలిఫోర్నియాలోని ఓ హాస్పిటల్​లో పని చేస్తున్నాడు. 

అదే హాస్పిటల్​లో నర్సుగా పనిచేస్తున్న లోరేనాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పకుండా 2018లో అక్కడి సంప్రదాయం ప్రకారం రామచంద్రరావు లోరేనాను పెండ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో చెప్పినా, కరోనా వల్ల ఇండియాకు రాలేకపోయారు. అక్కడే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. 

ఇటీవల భార్య, పిల్లలను తీసుకుని రామచంద్రరావు కొత్తగూడెం వచ్చాడు. అతడి పెండ్లి చూడలేకపోయామని, హిందూ సంప్రదాయం ప్రకారం రామచంద్రరావు, లోరేనాకు మళ్లీ పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిశ్చయించారు. బుధవారం భద్రాచలం రాములవారి సన్నిధిలో ఆ తంతు పూర్తిచేశారు. ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు సైతం ఈ జంటను ఆశీర్వదించారు.