
ఫేస్ బుక్ లో పరిచయం అయిన ముగ్గురు వ్యక్తులు, పాల షాపులో పనిచేసే మరో వ్యక్తి… ఓ వివాహితపై అత్యాచారం చేశారు. ఎవరికైనా విషయం చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఏడాదిపాటు సాగిన ఈ వేధింపులతో విసిగి పోయిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
రాయదుర్గంలోని ఓ వ్యక్తికి బెంగళూరుకు చెందిన యువతితో నాలుగేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి మూడు సవంత్సరాల కొడుకు ఉన్నాడు. ఏడాది నుంచి ఆ వివాహిత రోజూ పొద్దున ఇంటి దగ్గర ఉన్న పాల షాప్ నుంచి పాలు తీసుకవచ్చేది. దీంతో పాల షాప్ లో ఉండే మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. ఇదిలా ఉంటే.. ఆ వివాహిత తన మొబైల్ ఫోన్ నుంచి ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసింది. అందులో తనకు రాయదుర్గానికే చెందిన పవన్, చీటీ మల్లికార్జున్, ఫారుక్ ప్రెండ్స్ గా యాడ్ అయ్యారు. వీరితో కూడా తరచూ ఫోన్ మాట్లాడేది ఆ వివాహిత. దీంతో వారితో కూడా సాన్నిహిత్యం పెరిగింది.
ఫేస్ బుక్ ద్వారా వివాహిత సమాచారం అంతటినీ తెలుసుకున్న యువకులు.. తమ కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించారు. లేకపోతే.. ఆమె కులం వాళ్లకు చెప్తామని.. ఆమె భర్తపై, కొడుకుపై దాడి చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె వారికి లొంగిపోయింది. ఈ వ్యవహారం ఏడాదిగా నడుస్తుంది. వీరి వేధింపులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆ వివాహిత స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు పోలీసులు.