- సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్ లో విషాదం
చందుర్తి, వెలుగు: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం నర్సింగాపూర్ కి చెందిన ఆరేళ్ల శంకర్, అపర్ణ(27) దంపతులకు బాబు(7), కూతురు(2) ఉన్నారు.
పెండ్లి సమయంలో అపర్ణ పుట్టింటివాళ్లు రూ. రెండు లక్షల కట్నం పాటు బైక్ ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే.. ఆర్థిక పరిస్థితులు బాగోలేక బైక్ ను కొనివ్వలేకపోయారు. వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. అత్తింటి వేధింపులు ఎక్కువ అవడంతో ఆరునెలల కింద అపర్ణ పుట్టింటివాళ్లు పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టగా పద్ధతి మార్చుకుంటానని శంకర్ ఒప్పుకున్నాడు.
కాగా.. అతనిలో మార్పురాకపోగా భార్యను శారీరకంగా వేధించడమే కాకుండా, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుండడంతో భరించలేక మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వెంటనే వేములవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి.. అప్పటికే అపర్ణ మృతి చెందినట్టు చెప్పారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పోశవ్వ ఫిర్యాదు మేరకు భర్త శంకర్ తో పాటు అత్త లచ్చవ్వ, మామ రాజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చందుర్తి ఏఎస్ఐ బాబు తెలిపారు.