
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మంగళవారం లైంగిక వేధిపులతో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సాయినగర్కాలనీకి చెందిన మంజుల (34), శ్రీను భార్యాభర్తలు. వీరు10 సంవత్సరాలుగా ముంబయిలో చెట్ల మందు వైద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2 నెలల కింద ముంబయి నుంచి వారి సొంతూరు తొర్రూరుకు ఇల్లు కట్టుకోడానికి వచ్చి వారి తండ్రి ఇంట్లో ఉంటున్నారు. పై పోర్షన్లో తొర్రూరు మండలం వెలికట్ట టిక్యాతండా కు చెందిన జాటోతు జితేందర్ రెంట్‌కు ఉంటున్నాడు. ఈక్రమంలో మంజులను జితేందర్ లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టాడు.
ఈ బెదిరింపులకు తాళలేక 15 రోజుల కింద తన భర్త శ్రీనుకు జితేందర్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలుపడంతో తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జితేందర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా బుద్ధి మారకపోవడంతో గ్రామపెద్దలకు తెలుపడంతో వారు మందలించారు. మళ్లీ మంజులకు ఫోన్‌చేసి వేధించాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోవడంతో మంజుల చెల్లె ఊరైన తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి పంపించారు. అక్కడికి వెళ్లినా ఫోన్ చేసి వేధించాడు. దీంతో జితేందర్‌తో మాట్లాడుదామని ఇల్లంద గ్రామంలో రెంట్‌కు ఉంటున్న ఇల్లు దగ్గరకు మంజుల ఈనెల 23న రాత్రి వెళ్లింది. ఎలాగైన తన కోరిక తీర్చాలని అతడు వేధించడంతో ఆమె అక్కడే ఉన్న ఎలుకల మందు తాగింది.
దీంతో ఆమెను జితేందర్ ఎంజీఎం తీసుకెళ్లాడు. అక్కడే తొర్రూరుకు చెందిన కొందరు చూసి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడికి చేరుకుని చూసేసరికి మంజుల చనిపోయి ఉంది . తన భార్య చావుకు కారణమైన జితేందర్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.