హైదరాబాద్ లో మారియట్ ఇంటర్నేషనల్ జీసీసీ

హైదరాబాద్ లో మారియట్ ఇంటర్నేషనల్ జీసీసీ

హైదరాబాద్: హాస్పిటాలిటీ కంపెనీ మారియట్ ఇంటర్నేషనల్ తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌‌ను (జీసీసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మంగళవారం తెలిపారు.  ఇన్వెస్ట్​మెంట్​ రూ. 300–-400 కోట్లు ఉంటుందని, ఒకటిరెండు రోజుల్లో ఒప్పందం ఖరారు కావొచ్చని వెల్లడించారు.  ఈ ప్రాజెక్టు వల్ల 1,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడుల అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అమెరికాకు చెందిన మారియట్​ హోటల్ చైన్ ప్రారంభంలో 500 సీట్లు ఉండేలా స్థలం కోసం చూస్తోంది.  తదనంతరం  1,000కి అప్‌‌గ్రేడ్ చేయనుంది. రాష్ట్రంలో తమ సంస్థలను నెలకొల్పాలని కోరుతూ 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు.

ఇవన్నీ కార్యరూపం దాల్చితే వచ్చే రెండేళ్లలో దాదాపు 20,000 నుంచి 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు చెప్పారు.  అంతేగాక 'డిజిటల్‌‌ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్​ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని శ్రీధర్‌‌బాబు వెల్లడించారు.