
- అమెరికాలో సంస్థ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రముఖ పెట్స్ ఫుడ్ ఉత్పత్తి చేసే సంస్థ మార్స్ గ్రూప్ రూ.800 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు విస్తరించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఆ సంస్థ ఉన్నతాధికారి శేఖర్ కృష్ణమూర్తితో సమావేశమయ్యారు. మొదట సిద్దిపేటలో రూ.200 కోట్లతో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించామని, 2021 డిసెంబర్‌లో రూ.500 కోట్లతో ఆ యూనిట్‌ను విస్తరించామని తెలిపారు. ఇప్పుడు ఇంకో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని శేఖర్ కృష్ణమూర్తి తెలిపారు.
సిద్దిపేటలో మార్స్ సంస్థ తమ కార్యకాలాపాలు విస్తరించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, మీడియా అనుబంధ రంగాలకు చెందిన సంస్థ ఓమ్నికాం గ్రూప్ హైదరాబాద్‌లో తమ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జైద్ అల్ రశీద్ తెలిపారు.