
ఏకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో అదరగొడుతుంది. పవర్ ప్లే లో ఓపెనర్ మిచెల్ మార్ష్ దంచి కొట్టాడు. ఏకంగా ఒక్కడే 60 పరుగులు బాది లక్నోకు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. మార్ష్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఆసీస్ స్టార్ విరుచుకుపడడంతో పవర్ ప్లే లోనే లక్నో 69 పరుగులు రాబట్టింది. దీంతో ముంబై మ్యాచ్ లో వెనకబడింది. అయితే మార్ష్ ను ఔట్ చేసే అవకాశాన్ని ముంబై చేజేతులా వదులుకుంది.
తొలి ఓవర్ లోనే మార్ష్ ఔట్ కావాల్సింది. బోల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బ్యాట్ ఎడ్జ్ తాకినా ఒక్కరు కూడా అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్ లో బ్యాట్ స్పష్టంగా తగిలినట్టు చూపించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్.. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ జట్టు స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్.. మొత్తం 30 బంతుల్లో 61 పరుగులు చేసి విగ్నేష్ పుత్తూరు బౌలింగ్ లో ఔటయ్యాడు.
తొలి ఓవర్ లోనే ముంబై అప్పీల్ చేసి ఉంటే మార్ష్ నాలుగు పరుగుల దగ్గరే ఔటయ్యే వాడు. కానీ ముంబై నిర్లక్ష్యం కారణంగా మార్ష్ మరో 56 పరుగులు జోడించాడు. మార్ష్ (69) మెరుపులతో ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు జోడించింది. పూరన్ (12), పంత్ (2) విఫలమయ్యారు.