![రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుండు..! .. మర్సుకోల సరస్వతి ఫైర్](https://static.v6velugu.com/uploads/2023/10/marsukola-saraswathi-was-furious-that-revanth-reddy-had-sold--rich-man_1WvXhG6qQA.jpg)
ఆసిఫాబాద్, వెలుగు: ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ టికెట్‌ను ఆదివాసీకి ఇవ్వకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులున్న వ్యక్తికి అమ్ముకున్నాడని టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత మర్సుకోల సరస్వతి మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని.. నిన్న, మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివాసీలు అధికంగా ఉన్న ఆసిఫాబాద్ ఏజెన్సీ లో శ్యామ్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై టికెట్ ఆశించి బంగపడ్డ గణేశ్ రాథోడ్, ఆదివాసీలతో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించారు.
కుమ్రం భీం చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసుకు కాంగ్రెస్‌లో విలువలేదని, తనకు అన్యాయం చేశారని సరస్వతి కన్నీళ్లు పెట్టుకున్నారు. టికెట్ ఇస్తామని చేరదీసి చివరి క్షణంలో మోసం చేయడం ఆదివాసులను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని శ్యామ్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని ఆరోపించారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఇంటికీ, గడపగడపకూ వెళ్లి వివరిస్తానని, శ్యామ్ నాయక్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని ఆమె వెల్లడించారు.అనంతరం మర్సుకోల సరస్వతి మీడియా సమావేశం నిర్వహించారు. తనకు జరిగిన అన్యాయనికి నిరసనగా రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు డెలికేట్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
సస్పెండైన వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటి..?
గతంలో పార్టీలో ఉండి టికెట్ రాకపోవడంతో పలు ఆరోపణలు చేసిన నారాయణ రావు పటేల్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తికి టికెట్ఇవ్వడం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నించారు. ముథోల్ నియోజకవర్గ నేత డా.కిరణ్‌కుమార్‌కు టికెట్ రాకపోవడంతో ఆయన వర్గం శనివారం భైంసాలో ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ..
ఎంతో కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలు చేసి కిరణ్ కుమార్‌కు టికెట్ ఇస్తామని ఆహ్వానించిన కాంగ్రెస్.. చివరి నిమిషం వరకు ఆశ చూపి మోసం చేసిందని ఆరోపించారు. ఓటమి పాలయ్యే వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. తమ నాయకుడు ఖచ్చితంగా నామినేషన్ వేసి బరిలో ఉంటారని, గెలుపే లక్ష్యంగా తాము పనిచేస్తామని ప్రకటించారు. లీడర్లు దొంతుల దేవీదాస్, తోట నర్సయ్య, మహేశ్, ప్రసాద్, తోట రాజు, గౌతం, నవీన్, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.