ఇంగ్లాండ్ వేదికగా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ పై 18 పరుగుల తేడాతో గెలిచింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి సగటు భారతీయుడిని ఇప్పటికీ కలచి వేస్తుంది. గ్రూప్ దశలో టేబుల్ టాపర్ గా సెమీస్ కు వెళ్లిన భారత్.. సెమీస్ లో కివీస్ పై అనూహ్య పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ లో విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన సమయంలో ధోనీ రనౌట్ ను భారతీయలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో కు ధోనీ రనౌటయ్యాడు. ఈ రనౌట్ పై తాజాగా గప్తిల్ స్పందించాడు.
"2019 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ధోనీని డైరెక్ట్ త్రో చేసి అవుట్ చేసినందుకు అప్పటికీ నాకు ద్వేషపూరిత మెసేజ్ లు వస్తున్నాయి". అని గప్తిల్ వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మార్టిన్ గప్టిల్ ధోనీ రనౌట్ పై ఇలా స్పందించాడు. 2019 వరల్డ్ కప్ ముగిసి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా.. ఈ ఓటమిని, ధోనీ రనౌట్ ను అభిమానులు మర్చిపోలేకపోతున్నారంటే క్రికెట్ పై భారత్ అభిమానులకు ఉన్న పిచ్చి ఏంటో అర్ధమవుతుంది.
ఔట్ అయిన విషయం రిప్లేలో చూసి తెలుసుకున్న ధోనీ.. నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. ఆ సమయంలో మహీ కళ్లలోని బాధ ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరిన టీమిండియా.. ఈ మ్యాచు ఓటమితో మరోసారి ఐసీసీ టోర్నీ అందుకోకుండానే పోరాటం ముగించింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ సెమీ ఫైనల్లో మ్యాచ్ రెండు రోజులు జరిగింది. మొదట న్యూజిలాండ్ ను 239 పరుగులకే కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. స్వింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ట్రెంట్ బౌల్ట్ నేతృత్వంలోనే కివీస్ పేస్ దళం చెలరేగిపోయింది. దీంతో జట్టు స్కోరు 5 పరుగులకే భారత్ కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1)ల వికెట్లను కోల్పోయింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో జడేజా 77 పరుగులతో వీరోచిత పోరాటం చేసినా కీలక సమయంలో జడేజాతో పాటు ధోనీ రనౌట్ కావడం భారత్ కు పరాజయం తప్పలేదు.
Martin Guptill speaks on that MS Dhoni's Run Out pic.twitter.com/lJYv2gnuNE
— RVCJ Media (@RVCJ_FB) November 26, 2023