Legends 90 league: 49 బంతుల్లోనే 160 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర ఇన్నింగ్స్

Legends 90 league: 49 బంతుల్లోనే 160 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర ఇన్నింగ్స్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్  మార్టిన్ గప్టిల్ క్రికెట్ చరిత్రలోనే మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం (ఫిబ్రవరి 10) రాయ్‌పూర్‌లో జరిగిన లెజెండ్స్ 90 లీగ్ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ తరఫున ఆడుతన్న గప్టిల్.. బిగ్ బాయ్స్‌పై 49 బంతుల్లో 160 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లతో పాటు ఏకంగా 16 సిక్సర్లు ఉన్నాయి. 300 పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. 

ఇటీవలే అంతర్జాతీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కివీస్ మాజీ ఓపెనర్.. లెజెండ్స్ 90 లీగ్ లో తన తొలి మ్యాచ్ లోనే చితక్కొట్టాడు. గప్టిల్ దూకుడుకు బిగ్ బాయ్స్‌ బౌలర్ల సమాధానమే లేకుండాపోయింది. కొడితే సిక్సర్ లేకపోతే ఫోర్ అన్నట్టుగా అతని  విధ్వంసం సాగింది. గప్టిల్ ధనాధన్ ఇన్నింగ్స్ కు తోడు రిషి ధావన్ హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత 90 బంతుల్లో ఛత్తీస్‌గఢ్ వారియర్స్ వికెట్ కోల్పోకుండా 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బిగ్ బాయ్స్‌ 151 పరుగులకే పరిమితమైంది. 

14 ఏళ్ళ పాటు న్యూజిలాండ్ తరపున ఆడిన మార్టిన్ గప్టిల్ బుధవారం (జనవరి 8) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్టిల్ జనవరి 2009లో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై టీ20ల్లో.. మార్చి భారత్ పై టెస్ట్ ల్లో ఎంట్రీ ఇచ్చాడు. తన 14 ఏళ్ళ కెరీర్ లో న్యూజిలాండ్ తరఫున 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.

వన్డేల్లో 7346 పరుగులు చేసిన ఈ కివీస్ ఓపెనర్.. రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత న్యూజిలాండ్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 3,531 పరుగులతో  టీ20 ఫార్మాట్ లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్ తరపున బంగ్లాదేశ్ పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గుప్తిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ   దేశీయ క్రికెట్.. టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. ప్రస్తుతం అతను సూపర్ స్మాష్‌లో లీగ్ లో ఆక్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో ధోనీ రనౌట్ చేసి న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.