అమర జవాన్ పబ్బాల అనిల్కు కన్నీటి వీడ్కోలు

ఎప్పుడొస్తావు..నిన్ను చూడబుద్ది అవుతోంది...బావా లెవ్వే..అంటూ అమర జవాను పబ్బాల అనిల్ భార్య  గుండెలవిసేలా రోధిస్తుండటం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. కొడుకా అనిలూ.....లేవు బిడ్డా..అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెడుతుండటం ఆవేదన కలిగిస్తోంది. జమ్మూకశ్మీర్ అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పబ్బాల అనిల్ అంత్యక్రియల్లో చోటు చేసుకున్న హృదయవిదారక దృశ్యాలు ఇవి.

 జమ్మూ కశ్మీర్‌లో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించిన తెలంగాణ జవాన్‌ పబ్బాల అనిల్‌(30) భౌతికకాయానికి  స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపుర్ లో  ఆర్మీ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు పబ్బాల అనిల్ కు  కన్నీటి వీడ్కోలు పలికారు.  

అమరజవాన్ అనిల్ భౌతికఖాయానికి  మంత్రి గంగుల కమలాకర్, బీజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ నివాళులు అర్పించారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించారు. అనిల్ అంతిమయాత్ర జనసంద్రమైంది. గ్రామస్తులతో పాటు..పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జై జవాన్ నినాదాలతో మల్కాపూర్ మార్మోగిపోయింది. అనిల్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

జమ్మూ కశ్మీర్‌లో  కిస్త్‌వార్‌ జిల్లాలో మే 4వ తేదీన  గురువారం ఆర్మీకి చెందిన  ధుృవ్‌  హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కూలడంతో ఆర్మీ ఏవియేషన్‌ సీఎఫ్‌ఎన్‌(AF) విభాగంలో టెక్నీషియన్ గా  పనిచేస్తున్న పబ్బాల అనిల్‌ ప్రాణాలు కోల్పోయారు.  గురువారం తన సహచర బృందంతో కలిసి హెలికాప్టర్‌లో బయల్దేన అనిల్... టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్‌ సమస్యతో జమ్మూకశ్మీర్‌లోని మార్వా అటవీప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. హెడ్‌క్వార్టర్స్‌తో సిగ్నల్‌ కట్‌ అవడంతో ఈ దారుణం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడినవారిని తక్షణమే ఉదంపూర్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 5వ తేదీన శుక్రవారం అనిల్ భౌతిక దేహాన్ని ప్రత్యేక విమానంలో హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తెలంగాణ, ఆంధ్ర సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ రాకేష్‌ మనోచాతో పాటు మేడ్చల్‌ జోన్‌ డీసీపీ సందీప్‌గోనె, ఏసీపీ రామలింగరాజులు సైనిక వందనంతో అనిల్‌కు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అనిల్‌ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, మల్కాపూర్‌కు తరలించారు. 

 మలాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్య చిన్న కొడుకు అనిల్‌.  2011లో సైన్యంలో చేరి టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్‌, అరవ్‌ ఉన్నారు. ఏప్రిల్ నెలలో పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకలతోపాటు అత్తగారి ఊరు కోరెంలో జరిగిన బీరప్ప పట్నం పండుగలో అనిల్ పాల్గొనడం గమనార్హం.