మరో జంగ్ సైరన్​ మోగాలి

ప దేండ్లుగా ఆర్తితో అనాథలా విలపిస్తోంది తెలంగాణ జనం. రానున్నది సామాజిక తెలంగాణమని నుదిటిన పచ్చ బొట్టేసుకొన్నారు. సారు రెండు పర్యాయాల పాలనను చూసి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. మోసకారి పాలన నుంచి విముక్తం చేయాలని సకల పార్టీలని చేయెత్తి పిలుస్తున్నారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన తమ కొడుకులను తలచుకొని వీర మాతలు కుమిలిపోతున్నారు. ఇందుకోసమేనా మా కొడుకులు బలిదానమయ్యారని వాపోతున్నారు. సకల జనులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పే సమయం వచ్చింది. తెలంగాణ గతమంతా ప్రాణ త్యాగాల చరిత్రే. 1969లో 365 మంది విద్యార్థులు తుపాకీ గుండ్లకు బలి అయ్యారు. 2009లో 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బలిదానాలతోనే నూతన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 

అమరుల ఆశయాలు నెరవేరలేదు

ఆనాడు పోలీస్ కాల్పుల్లో మరణించిన అమరులు గానీ, ఆత్మహత్యలు చేసున్న అమరులు గానీ కోరుకున్నదొక్కటే మా రాష్ట్రం మాకుగావాలి. సోనియా, సుష్మాస్వరాజ్, మీరాకుమార్ కృషి ఫలితంగా భౌతికంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. స్వీయ పాలనలో అమరుల ఆశయాలు నెరవేరతాయి అనుకున్నాం. కానీ అది జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే యువకులు ఆత్మబలిదానం చేసుకొంటే అదీ నెరవేరలేదు. ఇప్పుడు పదేండ్ల పండుగ బలిదానాలను పరిహసించడానికి వచ్చిందనిపిస్తోంది. భూ కబ్జాలు, ఇసుక వ్యాపారాలు, ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్లు గుట్టుగా సాగిన అవినీతి పుట్టను బద్దలు కొట్టాయి. టీఎస్​పీఎస్సీ నియామకాలు తప్పు అని కోర్టు మొట్టికాయలు వేసింది. 2022 నుంచి కోర్టు బోనులో 10 వర్సిటీల వీసీల నియామకాలు ఎటూ తేలలేదు. 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తెలంగాణ యూనివర్సిటీ వీసీతో అవినీతి డొల్లతనం స్పష్టమవుతున్నది. 

ఒక కుటుంబం కోసమేనా..

తెలంగాణ వస్తే మా కొలువులు మాకే వస్తాయని తెగించి కొట్లాడిన నిరుద్యోగుల జీవితాలు బజారున పడ్డాయి. సాధించిన తెలంగాణలో కొలువులు భ్రమలై పోయాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం గాక ఒక కుటుంబం కోసం రాష్ట్రం వచ్చినట్లయింది. నిరుద్యోగులకు కొలువులు రాలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను అధికార ఉక్కుపాదాల కిందేసి నలిపేశారు. ప్రగతిభవన్ లో బందీయైన తెలంగాణను విముక్తి చేస్తే తప్ప తెలంగాణలో ఎవరూ సంతోషంగా ఉండరు. ల్యాండ్, స్యాండ్​ వ్యాపారాల్లో దోపిడీ, ప్రాజెక్టుల్లోనే గాదు దళితబంధు, రైతుబంధు, గొర్రెల పథకాల్లో 30 % కమీషన్ లాంటి దోపిడీ పోవాలంటే మరో ఉద్యమానికి సకల జనులు జంగ్ సైరన్ మోగించాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైనా అమరుల కుటుంబాలను పిలిచి గౌరవించాలని చూడలేదు. కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసినందుకేమో చివరికి శ్రీకాంతాచారి తల్లికి పిలుపొచ్చింది. 

ఉద్యమం తప్పదు

పదేండ్ల పండుగ వేళ ప్రభుత్వం బలిదాన మైన అమరుల తల్లులను ఆహ్వానించలేదని, కొడుకులను పోగొట్టుకొన్న తల్లులు గన్ పార్క్ లోని అమరుల స్థూపం వద్ద నిరసన తెలిపారనే విషయాన్ని విస్మరించొద్దు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారక స్థూపంలో తెలంగాణ అమరుల ఫొటోలు, విగ్రహాలు ప్రభుత్వం పెట్టలేదు. దేశంలో వినూత్నంగా నిర్మించడమంటే అమరుల ఛాయా చిత్రాలు లేని స్మారక భవనమన్నమాట.

జోహారు అమర వీరులకు అంటూ ఓ బోర్డు తగిలించారు అంతే. ఈ పదేండ్ల పాలనలో పాలకుల పథకాల ప్రచార ఆర్భాటం తప్ప అమరుల కుటుంబాలకు, ఉద్యమకారుకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీగా బీజేపీ, సీపీఐలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి రంగంలోకి దిగబోతున్నాయి. ప్రభుత్వ పథకాలు, సీఎం హామీలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా కొరుకుడు పడకుండా ఉన్నాయి. ఎదో ఒక జాతీయ పార్టీకి ‘జాగో తెలంగాణ’ మేధావులు జత కలిస్తే ప్రగతి భవన్ పాదాక్రాంతమవుతుంది.
- ప్రొ. ననుమాస స్వామి, అధ్యక్షుడు, తెలంగాణ, పోరాట యోధుల సంఘం 1969