![అమరవీరుల స్మారక స్తూపం గన్‌పార్క్](https://static.v6velugu.com/uploads/2022/10/Martyrs-Memorial-Stupa-Gunpark-in-Hyderabad_STaGFwsh64.jpg)
తెలంగాణ అమరవీరుల స్తూపం గన్‌పార్క్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 1969లో ప్రారంభమైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369మంది తెలంగాణవాదులు తమ ప్రాణాలను కోల్పోయారు. వీరి స్మారకార్థంగా హైదరాబాద్ నడిబొడ్డున ఒక స్తూపం నిర్మించాలని ప్రతిపాదించి 1969 మే 31న నిర్ణయించుకున్నారు. ఆనాటి హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ సమీపంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గన్‌పార్క్ రూపశిల్పి ఎక్కా యాదగిరి రావు పునాది వేసే సమయంలో భావితరాలకు ఈ వాస్తవ చరిత్రను తెలియజేయాలని భావించి 1969 ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఒక తామ్ర పత్రంపై రాసి అందులో భద్రపరిచారు.
ఉద్యమ సమయంలో వార్తా పత్రికల్లో ప్రచురించిన వార్తలను పాలిథిన్ కవర్లో చుట్టి అందులో ఉంచారు. అందుకే గన్‌పార్క్ కేవలం స్మారక స్తూపమే కాదు చరిత్రను తన కడుపులో దాచుకున్న పవిత్ర నిర్మాణంగా చెప్పవచ్చు. 1975లో గన్‌పార్క్ నిర్మాణం పూర్తయింది. నల్లరాయితో చేసిన స్తూపం నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్నచిన్న రంధ్రాలను అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులుగా ఏర్పాటు చేశారు. ఎరుపురంగులో కనిపించే గన్‌పార్క్ ఆవరణలో సాంచీస్తూపం నుంచి సేకరించిన ఒక మకరతోరణం ఉంది. తెలంగాణ తొమ్మిది జిల్లాల సంకేతంగా(అప్పటికి రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు) స్తూపం మధ్యభాగంలో గల స్తంభంపై ఏ వైపు నుంచి చూసినా దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. 25 అడుగుల ఎత్తులోని ఈ స్తూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రంతోపాటు తెలుపు రంగులో తొమ్మిది రేకులు గల ఒక పుష్పం ఉంటుంది.