
న్యూఢిల్లీ:ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో తమ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఏడాది లెక్కన ఒక శాతం తగ్గి రూ.3,911 కోట్లకు చేరుకుందని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. గత సంవత్సరం -మార్చి క్వార్టర్లో రూ.3,952 కోట్ల లాభం వచ్చింది. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.38,471 కోట్ల రూ.40,920 కోట్లకు పెరిగిందని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నాలుగో క్వార్టర్లో మొత్తం ఖర్చులు ఏడాది లెక్కన 8.5 శాతం పెరిగి రూ.37,585 కోట్లకు చేరాయి. స్టాండెలోన్ లెక్కన కంపెనీ నికర లాభం రూ.3,711 కోట్లకు తగ్గింది.
గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.3,878 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.38,849 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.36,697 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. జనవరి–-మార్చి కాలంలో అమ్మకాలు 6,04,635 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ అమ్మకాలు 3 శాతం, ఎగుమతులు 8 శాతం పెరిగాయి. దేశీయ అమ్మకాలు 5,19,546 యూనిట్లు కాగా, ఎగుమతులు 85,089 యూనిట్లుగా ఉన్నాయి.
పూర్తి సంవత్సర లాభం రూ.14,500 కోట్లు
ప్రస్తుత సంవత్సరం మార్చితో ముగిసిన పూర్తి సంవత్సరానికి రూ.14,500 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సంపాదించింది. ఇది 2023–-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.13,488 కోట్లతో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ. ఆదాయం రూ.1,41,858 కోట్ల నుంచి రూ.1,52,913 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన, కంపెనీ రూ.13,955 కోట్లతో ఆల్ టైమ్ హై నికర లాభాన్ని సాధించింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.13,209 కోట్లతో పోలిస్తే 6 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం నికర అమ్మకాలు ఏడాది లెక్కన 7.5 శాతం పెరిగి రూ.1,45,115 కోట్లకు చేరాయి.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 22,34,266 బండ్లను అమ్మింది. కంపెనీ వరుసగా నాలుగో సంవత్సరం కూడా ఎగుమతుల్లో మొదటిస్థానంలో ఉంది. మొత్తం ప్రయాణీకుల వాహనాల ఎగుమతుల్లో దాదాపు 43 శాతం వాటా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్ వృద్ధి చాలా తక్కువగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.135 చొప్పున డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసిందని కంపెనీ తెలిపింది. కింజి సైటో స్థానంలో కోయిచి సుజుకిని నాన్-–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.