- కంపెనీలకు లాభాలే లాభాలు
- ఆటో సెక్టార్‌లో మారుతి, ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో బజాజ్ ఫైనాన్స్ అదుర్స్
- ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా లాభాల్లోనే..
- ఎల్ అండ్ టీ టెక్‌కు క్యూ4 లో రూ.311 కోట్ల ప్రాఫిట్
ఆటో సెక్టార్ కంపెనీల పెర్ఫార్మెన్స్ ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో బాగుందనే సంకేతాలను మారుతి సుజుకీ ఇచ్చింది. ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 42 శాతం ఎగిసింది. ఒకవైపు బ్యాంకులు దుమ్ములేపుతుంటే తాము తగ్గేదేలే అంటూ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ కూడా ఎనలిస్టుల అంచనాలను దాటింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ కూడా తమ క్యూ4 రిజల్ట్స్‌ను బుధవారం ప్రకటించాయి.
బిజినెస్ డెస్క్, వెలుగు : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో మంచి గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ ప్రాఫిట్ కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది క్యూ4 లో 13.8 శాతం పెరిగి రూ. 358.66 కోట్లకు చేరుకుంది. అదే ఏడాది ప్రాతిపదికన అయితే 0.31 శాతం మాత్రమే పెరిగింది. కంపెనీ షేరుకి రూ.1.90 డివిడెండ్ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు ప్రీమియంల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ. 19,426.57 కోట్లుగా రికార్డయ్యింది. ఇది ఏడాది ప్రాతిపదికన 36 శాతం, క్వార్టర్లీ ప్రాతిపదికన 35 శాతం గ్రోత్‌కు సమానం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేరు బుధవారం 0.22 శాతం లాభపడి రూ.531 వద్ద క్లోజయ్యింది.
బజాజ్ ఫైనాన్స్..
ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ (కన్సాలిడేటెడ్) ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.3,157.79 కోట్ల నికర లాభం సంపాదించింది. కంపెనీకి కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.2,419.51 కోట్ల లాభం రాగా, తాజా క్వార్టర్‌లో ఈ నెంబర్ 30.51 శాతం పెరిగింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.2,973 కోట్లతో పోలిస్తే 6.21 శాతం గ్రోత్ నమోదు చేసింది. కార్యకలాపాల నుంచి రూ.11,359.59 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం, క్వార్టర్ ప్రాతిపదికన 5 శాతం గ్రోత్‌కు సమానం. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.8,626.06 కోట్లు, డిసెంబర్ క్వార్టర్‌లో రూ.10,784.31 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.7,771 కోట్లకు పెరిగింది. కంపెనీ కొత్తగా ఇచ్చిన లోన్లు ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయి..
ఎల్ అండ్ టీ టెక్నాలజీ..
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.310.9 కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.263.2 కోట్లతో పోలిస్తే క్యూ4 లో 18 శాతం ఎగిసింది. కార్యకలాపాల ద్వారా కంపెనీకి రూ. 2,096.2 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ.1,756.1 కోట్లుగా ఉంది. షేరుకి రూ.30 డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్అండ్ టీ టెక్ షేరు బుధవారం 0.62 శాతం ఎగిసి రూ.3,447 వద్ద క్లోజయ్యింది.
మారుతి సుజుకీ..
మారుతి సుజుకీ రిజల్ట్స్ మార్కెట్ అంచనాలను దాటాయి. ఇన్‌పుట్ కాస్ట్ తగ్గడం, కార్ల సేల్స్ ఊపందుకోవడంతో కంపెనీ ప్రాఫిట్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో రూ.2,670.8 కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 1,875.8 కోట్లతో పోలిస్తే ఇది 42.4 శాతం ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.26,749.2 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.32,059.6 కోట్లకు చేరుకుంది. మార్చి క్వార్టర్లో 5,14,927 బండ్లను అమ్మామని కంపెనీ ప్రకటించింది. ఒక్క డొమెస్టిక్ మార్కెట్‌లోనే 4,50,208 బండ్లను అమ్మగలిగామంది. ఏడాది ప్రాతిపదికన ఇది 5.3 శాతం గ్రోత్‌కు సమానం. మార్చి క్వార్టర్లో 64,719 బండ్లను ఎగుమతి చేసింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ 68,454 బండ్లుగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.90 డివిడెండ్‌గా ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. బజాజ్ ఆటో కూడా మార్చి క్వార్టర్‌లో ఎనలిస్టులు అంచనాలను అందుకున్న విషయం తెలిసిందే. మారుతి షేరు బుధవారం 0.19 శాతం లాభపడి రూ.8,485 వద్ద సెటిలయ్యింది. బజాజ్ ఆటో షేరు ఒక శాతం నష్టపోయి రూ.4,300 దగ్గర ముగిసింది.