
న్యూఢిల్లీ: ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు హర్యానాలోని ఖర్ఖోడాలో తమ మూడో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ కొత్త ప్లాంట్‌తో కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం అదనంగా ఏడాదికి 2.5 లక్షల బండ్లు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం మారుతి ఖర్ఖోడా ప్లాంట్ ఏడాదికి 2.5 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న రెండవ ప్లాంట్‌తో కంపెనీ ఏడాదికి మరో 2.5 లక్షల బండ్లను తయారు చేయగలదు.
తాజాగా మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మారుతి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మూడు ప్లాంట్ల సాయంతో ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా మారుతి సుజుకీ ఎదగనుంది. 2029 నాటికి ఖర్ఖోడాలోని ప్లాంట్లలో ఏడాదికి 7.5 లక్షల బండ్లను తయారు చేయనుంది. కొత్త ప్లాంట్ కోసం కంపెనీ రూ. 7,410 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.