చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్-1 మెయిన్స్​లో కాపీయింగ్

చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్-1 మెయిన్స్​లో కాపీయింగ్
  • పట్టుబడిన మహిళా అభ్యర్థి
  • ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీయింగ్​కు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 5వ రోజు ఎకానమీ అండ్ డెవలప్​మెంట్ ఎగ్జామ్ జరిగింది. ఈ సెంటర్​లో​ 787 మందికి 447 మంది శుక్రవారం పరీక్షకు హాజరయ్యారు. కాలేజీ పీజీ బ్లాక్ రూం నెంబర్ 210లో వనపర్తి జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థి తన చీర కొంగులో ఉన్న స్లిప్ తీసి పాయింట్స్​ నోట్​చేసుకోవడాన్ని ఇన్విజిలేటర్​గమనించారు. అనంతరం ఎగ్జామ్ సెంటర్ ఇన్ చార్జికి సమాచారం అందించగా, ఆమె వద్ద మరో రెండు స్లిప్​లు దొరికాయి. దీంతో ఆమె వద్ద ఉన్న ప్రశ్నా, జవాబు పత్రాలు, హాల్ టికెట్, స్లిపులను స్వాధీనం చేసుకొని టీజీపీఎస్​సీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై తొలుత ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన యంత్రాంగం ఎట్టకేలకు రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. అయితే, కాపీయింగ్​కు పాల్పడిన అభ్యర్థిని (హాల్ టిక్కెట్ నంబర్ 240921569)ని పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ తెలిపింది. ఆమె వద్ద దొరికిన సమాచారం ఏ ప్రశ్నకూ సంబంధం లేదని వివరణ ఇచ్చింది.