- నారాయణమ్మ కాలేజీలో ఘటన
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మరోసారి చిట్టీలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ జిల్లా జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ పరీక్ష కేంద్రంలో ఒక అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో ఆ అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదు. అంతేకాకుండా ఆ అభ్యర్థిని డిబార్ చేశామని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. కాగా.. శుక్రవారం పరీక్షలో సైతం ఇలాగే చిట్టీలతో ఒక అభ్యర్థి పట్టుపడింది. తాజాగా మరో అభ్యర్థి పట్టుపడటం గమనార్హం. ఈ వరుస ఘటనలతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.