- నిందితురాలు అరెస్ట్
- రూ.5.8 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు : రోల్డ్ గోల్డ్ నగలను తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటూ మోసగిస్తున్న పాల్పడుతున్న మహిళను సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద రూ.5.8 లక్షలు నగదు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంతోశ్నగర్కు చెందిన గణపత్ కుమార్ స్థానికంగా జువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న బురఖా ధరించిన రబియా బేగం(45) షాపునకు వచ్చింది. తన పేరు యాస్మిన్ బేగంగా చెప్పింది. బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీకి రూ. 2 లక్షలు అప్పు ఇవ్వాలని కోరింది. తన బ్యాగ్‌లోంచి 75 గ్రాముల గోల్డ్ చైన్ తీసి ఇచ్చింది. పరిశీలించిన గణపత్ అది అసలైన బంగారంగా గుర్తించాడు. అప్పు ఇచ్చేందుకు అంగీకరించాడు.
రబియా బేగం తన ప్లాన్‌లో భాగంగా నెలకు 1.5 శాతం మాత్రమే వడ్డీ ఇస్తానని చెప్పింది. కొద్దిసేపు బతిమిలాడినట్లు నటించి ఆ తర్వాత తన గోల్డ్ చైన్ తీసుకుని వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగివచ్చి నెలకు2 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి గణపత్‌కు ఆభరణాన్ని ఇచ్చింది. అప్పటికే దాన్ని పరిశీలించినందున గణపత్ మళ్లీ చెక్ చేయలేదు. రూ.2 లక్షలు రబియాబేగంకు ఇచ్చాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత పరిశీలించి చూసి అదిరోల్డ్ గోల్డ్‌గా గుర్తించాడు. దీంతో ఈనెల16 న సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. కాలాపత్తర్‌కు చెందిన రబియాబేగంను అరెస్ట్ చేశారు. చార్మినార్, శాలిబండ సహా సిటీలోని మరో ఐదు ప్రాంతాల్లో ఆమె ఇలాంటి చోరీలు చేసినట్లు గుర్తించారు.
ALSO READ : పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్ల స్కామ్స్