- సంస్కరణవాదికే పట్టం కట్టిన జనం
- భారత్, ఇరాన్‌ల మధ్య మరింత బలపడనున్న బంధం
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద నేత, కార్డియాక్ సర్జన్ మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. సంప్రదాయ పిడివాద నేత, న్యూక్లియర్ డీల్ మాజీ మధ్యవర్తి సయీద్ జలిలీని ఈ ఎన్నికల్లో జనం తిరస్కరించారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ గత మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం జూన్ 28న ఎన్నికలు జరిగాయి.
అయితే, దేశంలో 6 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం 40% మంది మాత్రమే ఓట్లు వేశారు. 1979లో ఇస్లామిక్ రెవెల్యూషన్ తర్వాత దేశంలో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇరాన్ చట్టాల ప్రకారం.. పోల్ అయిన ఓట్లలో కనీసం 50% ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ జూన్ 28న జరిగిన ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మసౌద్‌కు 42%, జలిలీకి 39% ఓట్లు మాత్రమే వచ్చాయి. నలుగురు అభ్యర్థుల్లో ఎవరికీ పోలైన ఓట్లలో 50% రాకపోవడంతో శుక్రవారం రన్ ఆఫ్ ఎలక్షన్ పెట్టి మళ్లీ ఓటింగ్ నిర్వహించారు.
రన్ ఆఫ్ ఎలక్షన్‌తో కలుపుకుని మొత్తం 3 కోట్లకుపైగా మంది(49.8%) ఓట్లు వేయగా.. మసౌద్ పెజెష్కియాన్ 1.60 కోట్లకుపైగా ఓట్లతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రెండో స్థానంలో నిలిచిన జలిలీకి 1.3 కోట్ల ఓట్లు వచ్చినట్టు చెప్పారు. మరోవైపు 6 లక్షలకుపైగా చెల్లని ఓట్లు పడ్డాయని తెలిపారు. గత కొన్నేండ్లుగా దేశంలో ఆర్థిక సంక్షోభం, నిరసనలపై ఉక్కుపాదం వంటి అంశాల నేపథ్యంలో ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపలేదని భావిస్తున్నారు.
ఇండియాతో బంధం మరింత పటిష్టం..
ఇరాన్‌తో ఇండియాకు దీర్ఘకాలంగా పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. మసౌద్ పెజెష్కియాన్ అధ్యక్షుడు కానున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో సంస్కరణలు చేపట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని ఎన్నికల ప్రచారంలో మసౌద్ హామీ ఇచ్చారు. కానీ కీలక అంశాల్లో దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నిర్ణయమే అంతిమమని, మసౌద్ సంస్కరణలు అమలయ్యే చాన్స్ లేదని భావిస్తున్నారు.