ఓపెన్ ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్​లో అక్రమాలు

 

  • ఒకరికి బదులు మరొకరు రాసేందుకు రూ. 2,500

మిర్యాలగూడ, వెలుగు : ఈనెల 25వ తేదీన ప్రారంభమైన ఓపెన్ సొసైటీ ఇంటర్, టెన్త్ పరీక్షలు మిర్యాలగూడలో నిర్వాహకుల జేబులు నింపుతున్నాయి. పట్టణంలోని  బకల్ వాడీ జిల్లా పరిషత్, మిర్యాలగూడ  ప్రభుత్వ పాఠశాల, సెయింట్ మేరీస్ స్కూల్ హైస్కూల్  ఇలా మొత్తం 5 సెంటర్లలో  ప్రభుత్వం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే  నిర్వాహకులకు మాత్రం రోజుల వ్యవధిలో  లక్షలు దండుకునే అవకాశం ఇచ్చింది.  పరీక్షలకు రేట్లు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. అభ్యర్థుల నుంచి  పరీక్షకు రూ. 500, ఒకరి బదులు మరొకరు రాసేందుకు రూ. 2,500 చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   మొత్తం 5 సెంటర్లలో  527  మందికి 475 మంది పరీక్షలు రాసిండ్రని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 రోజుల వ్యవధిలో రూ. 48.37 లక్షల దందా...!

 ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరిగే  ఈ ఓపెన్ పరీక్షల్లో లక్షల దందాకు  తెరలేపారు. రోజుల వ్యవధిలో సుమారు రూ. 48.37 లక్షల దందాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు  పరీక్షలు పూర్తి కాగా...అభ్యర్థుల నుంచి వసూళ్ల పర్వం సాఫీగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులను నిర్వహకులు మేనేజ్ చేసి తమ దందాను సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులుదృష్టి సారించాలని పలువురు కోరారు.