గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన 5వేల భక్తులు.. వారికి ప్రత్యేక దర్శనం

యాదగిరిగుట్ట : పంచనారసింహ క్షేత్రంమైన యాదగిరి గుట్టలో మంగళవారం సామూహిక గిరి ప్రదక్షిణం ప్రారంభమైంది. అరుణాచలం, సింహాచలం తరహాలో ఇక్కడ ఇకపై సామూహిక గిరి ప్రదక్షిణను నిర్వహించనున్నారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున చేపట్టిన ఈ సామూహిక గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు దాదాపుగా 5 వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. 

అనంతరం కాలినడకన కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ ఆఫీసర్లు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఉదయం 5:45 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు చేసి సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

భక్తులతో కలిసి కొండ చుట్టూ దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసి తిరిగి వైకుంఠ ద్వారం వద్ద ముగించారు. అనంతరం స్వామివారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి.. కొండపైకి వెళ్లి నారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సామూహిక గిరిప్రదక్షిణలోఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, అన్ని విభాగాల ఆలయ ఆఫీసర్లు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 

కాగా సామూహిక గిరిప్రదక్షిణ కోసం.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసి లైటింగ్ సదుపాయం కల్పించారు. గిరిప్రదక్షిణ మార్గానికి మరమ్మత్తులు చేసి భక్తులు ఈజీగా నడిచే విధంగా గిరిప్రదక్షిణ మార్గాన్ని రెడీ చేశారు.